ఫేస్‌బుక్ కావాలో, ఉద్యోగం కావాలో తేల్చుకో.. కల్నల్‌కు కోర్టు వార్నింగ్  - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్‌బుక్ కావాలో, ఉద్యోగం కావాలో తేల్చుకో.. కల్నల్‌కు కోర్టు వార్నింగ్ 

July 16, 2020

Lt Col moves Delhi high court against apps ban

ఫేస్‌బుక్‌ లేకుండా ఉండలేనని ఓ లెప్టినెంట్ కల్నల్ కోర్టుకెక్కాడు. అయితే కోర్టు అతని అభ్యర్థనను కొట్టి పారేసింది. ఫేస్‌బుక్‌ కావాలో, ఉద్యోగం కావాలో తేల్చుకోమని తేల్చి చెప్పింది. ఫేస్‌బుక్‌ కావాలనుకుంటే శభ్రంగా ఉద్యోగం వదులుకోమని నిరభ్యంతరంగా చెప్పింది. సైన్యం ఆదేశాలకు అనుగుణంగా ఖాతాలను డిలీట్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఆయన పరిస్థితి గందరగోళంగా తయారైంది. సైన్యంలో పనిచేసేవారు సోషల్ మీడియా యాప్‌లను డిలీట్ చేయాల్సిందేనని ఇటీవల సైన్యం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే లెఫ్టినెంట్ కల్నల్ పీకే చౌదరీ ఎఫ్బీ నుంచి మినహాయింపు కోరుతూ ఢిల్లీ హైకోర్టుకు ఎక్కారు. ‘ఫేస్‌బుక్ ఖాతాను డిలీట్ చేస్తే డేటా, స్నేహితులు, కంటెంట్‌ను శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుంది. ఈ నష్టాన్ని తర్వాత పూడ్చలేం’ అని కోర్టుకు విన్నవించుకుకున్నారు. ఆయన అభ్యర్థనపై కోర్టు స్పందించింది. 

సైన్యం నుంచి వైదొలిగిన తర్వాత ఫేస్‌బుక్‌లో మళ్లీ కొత్తగా ఖాతా తెరుచుకోవచ్చని, అది ఇప్పటి ఖాతాలానే పనిచేస్తుందని తెలిపింది. దేశ భద్రతపై ఆందోళనలు చెలరేగుతున్న వేళ మినహాయింపులు ఇవ్వలేమని ఖరాఖండిగా చెప్పేసింది. సైన్యం ఆదేశాల అనుసారం నుడుచుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. లేదూ, ఫేస్‌బుక్ కావాలనుకుంటే ఉద్యోగానికి రాజీనామా చేయవచ్చని వెల్లడించింది. ఉద్యోగమా, ఫేస్‌బుక్కా తేల్చుకోవాలని జస్టిస్ రాజీవ్ సహాయ్, ఆశా మేనన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ కేసులో కేంద్రం తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ మాట్లాడుతూ.. ‘ఫేస్‌బుక్‌లో మేము గుర్తించిన బగ్ సైబర్ యుద్ధంలో వినియోగించేదానిలానే పనిచేస్తోంది. ఇప్పటికే అది సైన్యంలోని చాలామంది ప్రతినిధులను లక్ష్యంగా చేసుకుంది’ అని కేంద్రానికి తెలిపారు. కాగా, దీనిపై సైన్యం పాలసీని పరిశీలించి కోర్టు తీర్పును ఈ నెల 21కి వాయిదా వేసింది.