Lucky to be an autodriver.. overnight millionaire
mictv telugu

ఆటోడ్రైవర్‌ని వరించిన అదృష్టం..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు

September 19, 2022

అదృష్టం అంటే ఏంటీ? అది ఎలా తలుపు తట్టుతుంది? ఈ భూమ్మీద అదృష్టం అనేది ఒకటి ఉందా? అనే సందేహాలు ఇప్పటికి చాలా మందిలో పదే పదే మెలుగుతుంటాయి. అయితే, అదృష్టమనేది ‘కష్టపడితేనే తప్ప, కూర్చోని ఆలోచిస్తే వచ్చేది కాదు’ అని మహానుభావులు చెప్పిన మాట నేటికీ రూఢిలో ఉంది. ఆ మాటను దృష్టిలో ఉంచుకొని, తన కష్టాన్నే నమ్ముకొని రాత్రనక, పగలనక ఆటోడ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూ, తన కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ వ్యక్తికి అదృష్టం వద్దన్నా తలుపు తట్టింది. రాత్రికి రాత్రే అతనిని కోటీశ్వరుని చేసింది.

వివరాల్లోకి వెళ్తే..కేరళ రాజధాని తిరువనంతపురంలోని శ్రీవరాహం ప్రాంతంలో నివాసం ఉంటున్న అనూప్..ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. శనివారం టికెట్ కొనేందుకు వెళ్లిన అతడు. తొలుత వేరే టికెట్‌ను తీసుకున్నాడు. ఆ తర్వాత దాన్ని వెనక్కి ఇచ్చేసి, మరో టికెట్ తీసుకున్నాడు. శనివారం టికెట్ కొనుగోలు చేసిన అతనికి, ఆదివారం రోజున లాటరీ యాజమాన్యం నుంచి ఓ ఫోన్ వచ్చింది. ‘మీరు తీసుకున్న ఓనం బంపర్ లాటరీలో మీరు ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నారు. షాపుకు వచ్చి డబ్బులు తీసుకెళ్లండి’ అని చెప్పడంతో ఆ డ్రైవర్ తెగ ఆనందపడ్డాడు.

”నమ్మలేకపోతున్నా. నాకు ఇంత పెద్ద అదృష్టం వరించిందా అని. ఆటో డ్రైవర్‌గా పని చేయటం మానేసి. మలేసియాలో షెఫ్‌గా పని చేసేందుకు సిద్ధమయ్యాను. అందుకోసం బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు కూడా చేసుకున్నాను. లాటరీ విషయం తెలియడంతో బ్యాంకు అధికారులకు ఫోన్ చేసి, నాకు లోన్ వద్దని చెప్పాను. ఇప్పుడు మలేసియా వెళ్లాలన్న నిర్ణయాన్ని కూడా విరమించుకున్నా. ఈ డబ్బుతో కొత్త ఇంటిని నిర్మించుకుంటా. అప్పులను తీర్చేస్తా” అని అనూప్ తెలిపాడు.