Lulu Group to set up big shopping mall in Ahmedabad
mictv telugu

గుజరాత్‌లో దేశంలోనే అతిపెద్ద మాల్.. 3 వేల కోట్లతో ముందుకొచ్చిన లులూ గ్రూప్

October 19, 2022

యూఏఈకి చెందిన ప్రముఖ లులూ గ్రూప్ సంస్థ అహ్మదాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం కంపెనీ రూ. 3 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. అత్యాధునిక హంగులతో నిర్మించనున్న ఈ మాల్‌ను వచ్చే ఏడాది ప్రారంభిస్తామని కంపెనీ ప్రతినిధి వి. నందకుమార్ తెలిపారు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఎక్స్‌పోలో ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ఒప్పందం జరిగింది.

ఈ భారీ షాపింగ్ మాల్‌లో 300 కంటే ఎక్కువ జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌లు, 3 వేల మంది తినగలిగే మల్టీ క్యూషన్ రెస్టారెంట్, 15 స్క్రీన్లు కలిగిన ఐమాక్స్ మల్టీప్లెక్స్, పిల్లల కోసం దేశంలోనే అతిపెద్ద వినోద కేంద్రంతో పాటు ఇతర ఆకర్షణలు ఉంటాయని నందకుమార్ వెల్లడించారు. దీని వల్ల ప్రత్యక్షంగా మూడు వేల మందికి, పరోక్షంగా 12 వేల మందికి ఉపాధి దొరుకుతుందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ పనులు చివరి దశలో ఉన్నాయని తెలిపారు. కాగా, ఈ సంస్థకు ఇప్పటికే కేరళలోని కొచ్చిలో, ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో షాపింగ్ మాల్స్ ఉన్నాయి.