Lumpy virus cases in the states have a severe impact on milk supply
mictv telugu

లంపీ కలకలం.. పాలు తాగేందుకు జంకుతున్న జనం

September 12, 2022

దేశంలో లంపీ వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. జంతువులకు సోకే ఈ చర్మ వ్యాధి ఇప్పటివరకూ 10కిపైగా రాష్ట్రాల్లో వ్యాపించింది. రాజస్థాన్‌లో అత్యంత భయంకరంగా వ్యాపిస్తోంది. ఈ వైరల్ వ్యాధి వల్ల పశువులకు జ్వరం, చర్మంపై నోడ్యూల్స్‌తో పాటు మరణానికి కూడా దారితీస్తుంది. ఈ వ్యాధి దోమలు, ఈగలు, పేనులు, కందిరీగలు, పశువుల మధ్య ప్రత్యక్ష సంబంధం, కలుషితమైన ఆహారం, నీటి ద్వారా వ్యాపిస్తుంది.

ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు జంతువులలో జ్వరం, కళ్ళు మరియు ముక్కు నుండి స్రావాలు, నోటి నుండి లాలాజలం, శరీరమంతా నోడ్యూల్స్ వంటి మృదువైన పొక్కులు, పాల ఉత్పత్తి తగ్గడం, తినడానికి ఇబ్బంది, ఇది కొన్నిసార్లు జంతువు మరణానికి దారితీస్తుంది. “గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌తో సహా ఆరు-ఏడు రాష్ట్రాల్లో లంపీ చర్మ వ్యాధి వ్యాపించింది. ఆంధ్రప్రదేశ్‌లో, కొన్ని కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలోనూ లంపి వైరస్‌ కేసులు 173 నమోదయ్యాయి.

ఇదిలా ఉండగా, లంపీ భయంతో రాజస్థాన్, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో పాల వినియోగం తగ్గింది. ఈ వైరస్ భయంతో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు పాలు తాగేందుకు భయాందోళన చెందుతున్నారు. కొన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా డెయిరీల వద్ద పాలు, నెయ్యి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లల తల్లిదండ్రులు దీనిపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రధాని మోడీ.. ఈ వ్యాధి గురించి చెబుతూ.. ఈ వైరస్ ను నియంత్రించేందుకు రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా కృషి చేస్తోందని అన్నారు. శాస్త్రవేత్తలు లంపీ చర్మ వ్యాధి నివారణకు స్వదేశీ వ్యాక్సిన్‌ను సిద్ధం చేశారని వరల్డ్ డెయిరీ సమ్మిట్ 2022లో ప్రధాని మోడీ ప్రసంగించారు.