అమెరికాలో అరుదైన ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. కరోనా వైరస్ బారినపడిన ఓ యువతి రెండు ఊపిరితిత్తులను మార్చారు. షికాగోలో నార్త్‌వెస్టర్న్ మెడిసిన్ ఆస్పత్రిలో ఈ చికిత్స జరిగింది. దీనికి భారత సంతతికి చెందిన వైద్యుడు నేతృత్వం వహించాడు. దీంతో ఆ డాక్టర్ ప్రతిభకు పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుత సమయంలో ఎంతో కష్టతరమైన పనిని పూర్తి చేయడం వైద్య రంగంలో అరుదైన ఘటనగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల ఓ 20 ఏళ్ల యువతి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలోనే ఆమెకు కరోనా వైరస్ కూడా సోకడంతో రెండు ఊపిరితిత్తులు పాడైపోయాయి. వాటిని మార్చడం తప్ప మరో మార్గం లేదని వైద్యులు గుర్తించారు. థొరాసిక్ సర్జన్ నిపుణుడైన భారత సంతతి డాక్టర్ అంకిత్ భరత్ దీనికి నేతృత్వం వహించారు. ఆమెకు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. కరోనా రోగికి అమెరికాలో ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ ఇదే మొదటిది కావడం విశేషం. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఊపిరితిత్తులు సేకరించినట్టు ఆమెకు అమర్చామని అంకిత్ వెల్లడించారు.