ఆ వైన్ షాపులో కొనేవాడే లేడు.. ఎక్కడో కాదు ఏపీలోనే..
వైన్ షాపులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మందుబాబులు తెగ సంబరపడిపోతున్నారు. ఎక్కడ చూసినా కిలోమీటర్ల కొద్ది క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. చుక్కకోసం పరితపించి పోతున్నారు. కానీ అనంతపురంలోని మడకశిరలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. మద్యం షాపు తెరిచినా ఏ ఒక్కరు కూడా అటుగా రావడం లేదు. దీంతో ఆ దుకాణం పూర్తిగా వెలవెలబోయి కనిపిస్తోంది. అడపా దడపా వచ్చే కస్టర్లు మినహా అక్కడ ఎవరూ పెద్దగా కనిపించకపోవడం విశేషం.
ఇక్కడ మందు బాబుల్లో మార్పు వచ్చిందా అంటే అది లేదు. ఇది ఏపీ - కర్ణాటక సరిహద్దుల్లో ఉండమే ఇందుకు కారణం. ఏపీలో మద్యం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో అంతా కర్నాటక వెళ్లి మద్యం తెచ్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మడకశిర నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్నాటక వైన్ షాపులో చవకగా మద్యం దొరుకుతుంది. ఇంకే ముంది రాష్ట్రం దాటి మరీ తీసుకొచ్చుకుంటున్నారు. నచ్చిన బ్రాండ్లు, భారీ ఆఫర్లు ఉండటంతో అంతా అటువైపే వెళ్తున్నారు. అందుకే రాష్ట్రమంతా క్యూ లైన్లు కనిపించినా అక్కడ మాత్రం వైన్ షాపు ముందు పురుగు కూడా కనిపించడం లేదు. ఎవరో ఒకరు రాకపోతారా అనే ఆసక్తితో అక్కడి వైన్ షాపు సిబ్బంది ఆశగా ఎదురుచూస్తున్నారు.