మధుబాల మళ్లీ పుట్టింది.. కుర్రాళ్లను ఊపేస్తోంది..! - MicTv.in - Telugu News
mictv telugu

మధుబాల మళ్లీ పుట్టింది.. కుర్రాళ్లను ఊపేస్తోంది..!

October 25, 2019

Madhubala’s .

అలనాటి బాలీవుడ్ తార మధుబాలను అంత త్వరగా ఎలా మరిచిపోతాం చెప్పండి. ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ అంటూ అప్పటి కుర్రకారును ఉర్రూతలూగించిన అందాల రాశి ఆమె. ముగ్ధమనోహరమైన ఆ నవ్వు, పువ్వులాంటి ముఖంలో విరిసే అమాయకత్వం ఆమె సొంతం.  మొఘల్-ఎ-ఆజమ్, చల్తీకా నామ్ గాడీ, దిల్ కీ రాణి, బాయ్ ఫ్రెండ్, బాకసూర్, నిరాలా, బాదల్, బాంబేకా బాబు, బర్సాత్‌కి రాత్, మిస్టర్ అండ్ మిసెస్55, అర్మాన్.., ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్‌లో ఆమె నటించిన ప్రతీ సినిమా ఒక ఆణిముత్యమే. అందం, అభినయంతో ఆమె వెండితెరపై చెరగని సంతకం చేసి వెళ్లిపోయింది. ఆమె పోయినా ఆమె సినిమాలు ఎప్పటికీ అజరామరంగా నిలుస్తాయి. అయితే ఇప్పుడు మధుబాల గురించి ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఆమె మళ్లీ జన్మించిందా అనిపిస్తోంది ఈమెను చూస్తుంటే. 

60వ దశకంలో చనిపోయిన ఆమె మళ్లీ పుట్టిందా అనిపిస్తుంది ప్రియాంక కద్వాల్‌ను చూస్తే. ఎవరీ ప్రియాంక కద్వాల్? ఎక్కడినుంచి వచ్చింది? అచ్చు గుద్దినట్టు ఆమె మధుబాలలా ఉందేమిటి? ఇలా సోషల్ మీడియాలో ఆమెపై చాలామంది చాలా రకాలుగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు. అది నిజమే అని చాలా సందర్భాలలో నిరూపితమైంది. కాకపోతే ఒకే కాలంలో ఇలాంటివి జరిగాయి. అయితే ఆ వ్యక్తి చనిపోయాక ఇన్నేళ్లకు అలాంటి వ్యక్తి తారసపడటం అంటే అది పునర్జన్మే కావచ్చు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నవాళ్లు కోకొల్లలు. 

ప్రియాంక ప్రస్తుతం టిక్‌టాక్‌లో చాలా ఫేమస్ అయింది. కారణం ఆమె ముఖం అచ్చు మధుబాలలా ఉండటమే. మధుబాల అప్పట్లో సినిమాల్లో కట్టుకున్న చీరలు కట్టుకుని, హెయిర్ స్టైల్ అలానే ఉంచుకుని బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను షేర్ చేస్తోంది. తన ఫోటో పక్కనే మధుబాల ఫోటో పెడుతోంది. అయితే ఈ రెండు ఫోటోల్లో మధుబాల ఎవరో, ప్రియాంక ఎవరో పోల్చుకోవడం అభిమానులకు కష్టంగా మారింది. మధుబాల నటించిన పాత పాటలపై ఆమె చేస్తున్న వీడియోలకు మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. దీంతో ఆమె అనతికాలంలోనే ‘టిక్‌టాక్ మధుబాల’గా ఫేమస్ అయి సెలెబ్రిటీ అయిపోయింది. ఆమె పర్‌ఫార్మ్ చేసిన పాటలను ప్రియాంక తన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేసింది. 

ఆమె వీడియోలను చూసి ఆమెకు చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. మధుబాలను మళ్లీ గుర్తు చేస్తున్నావ్.. నీ నవ్వు, కళ్లు, ఆ రూపం అంతా మధుబాలలానే ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. 22 ఏళ్ల ప్రియాంక చైల్డ్ ఆర్టిస్టుగా బసంత్, ముంతాజ్ మహాల్, పూల్‌వారి వంటి సినిమాల్లో నటించింది. మరియం ఖాన్(హిందీ), స్టైల్(మలయాళం), నీనాడేనా(కన్నడ) అనే  చిత్రాల్లో కథానాయికగా నటించిన ప్రియాంక డెహ్రడూన్‌లో జన్మించింది.