లాక్‌డౌన్‌లో ‘శుభలగ్నం’.. నా ఆస్తి తీస్కో, నీ మొగుణ్ని ఇచ్చెయ్..
కొంతకాలం క్రితం తెలుగులో వచ్చిన ‘శుభలగ్నం’ సినిమా కథ గుర్తుందా? తన భర్తతో ప్రేమలో పడ్డ యువతికి సదరు భార్య కోటి రూపాయలకు రేటు కట్టి భర్తను అమ్ముకుంటుంది. అచ్చు అలాంటి కథే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటు చేసుకుంది. భర్తపోయి ఒంటరిగా ఉంటున్న ఓ మధ్యవయసు ఉద్యోగిని అదే కార్యాలయంలో పనిచేసే ఉద్యోగితో ప్రేమలో పడింది. అతను వరుసగా కొన్ని రోజులు ఆఫీసుకు రాకపోయేసరికి సరాసరి అతని ఇంటికి వెళ్లిందామె. ఇంట్లో ఉన్న అతని భార్యకు తన ఆస్తినంతా ఇచ్చేస్తాను.. నీ భర్తను తనకు వదిలెయ్యాలని కోరింది. ఊహించని ఆమె ఆఫర్‌కు ఆమె షాక్ అయింది.
మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఓ మహిళా ఉన్నతాధికారి(57) భర్త పదేళ్ల క్రిందట చనిపోవడంతో కోడలితో కలిసి జీవిస్తోంది. అయితే తాను విధులు నిర్వహిస్తున్న శాఖలో పని చేస్తున్న ఉద్యోగి(45)తో ఆమె ప్రేమలో పడింది. ఆమె కోడలు కూడా సరిగ్గా పట్టించుకోకపోవడం.. అసహ్యించుకుంటుండడంతో తోడు కోసం ఆ ఉద్యోగికి దగ్గరైంది. ఈ క్రమంలో కరోనాతో లాక్‌డౌన్ కారణంగా అతను కార్యాలయానికి రాలేకపోయాడు. దీంతో అతనిని చూడకుండా ఉండలేకపోయిందామె. ఓ రోజు నేరుగా ఉద్యోగి ఇంటికి వెళ్లింది. వంటగదిలో పని చేసుకుంటున్న ఆమె భార్యని పిలిచి షాకింగ్ వార్త చెప్పింది. తన ఆస్తి మొత్తం తీసుకుని.. ఆమె భర్తని తనకిచ్చేయాలని అడగడంతో ఆమె గుడ్లు తేలేసింది. తేరుకుని సదరు ఉద్యోగి భార్య ఆమె ఆఫర్ వద్దని గొడవకు దిగింది. ఈ విషయం ఆఫీసర్ కోడలి దాకా వెళ్లింది. దీంతో వివాదం మరింత ముదిరి పంచాయితీ కోర్టుకు చేరింది. అయితే ఆ ఉద్యోగి కూడా ఆమెను విడిచి ఉండలేనని అతని భార్యకి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో ఆమె ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. పెళ్లైన 14 ఏళ్ల తర్వాత తన భర్త తనను మోసం చేశాడని.. భర్తని వదిలిపెట్టేది లేదంటూ కేసు పెట్టింది. వారికి ఫ్యామిలీ కోర్టు కౌన్సిలింగ్ నిర్వహిస్తోంది. కాగా, అచ్చం శుభలగ్నం స్టోరీలా ఉంది కదూ ఈ కథ. కాకపోతే అందులో యువజంట ఉంటే ఇందులో వయసైపోయినవారు ఉన్నారు అంతే తేడా.