Madhya Pradesh boy with rare 'werewolf syndrome' has hair growing all over body
mictv telugu

తోడేలు మానవుడు.. మనదేశంలోనే..

November 24, 2022

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించిన తోడేలు మూవీ ‘భేడియా’ శుక్రవారం విడుదల కానుంది. హీరో తోడేలు అవతారం ఎత్తేసి కొంచెం కామెడీ, ఎంతో బీభత్సం సృష్టిస్తాడని ట్రైలర్ బట్టి తెలుస్తోంది. ఇలాంటి కథలతో హాలీవుడ్‌లో చాలా సినిమాలే వచ్చాయి. కలెక్షన్లు కూడా బాగానే కొల్లగొట్టాయి. ‘తోడేలు’ సినిమాల జానర్ అనేదొకంటుంది అక్కడ. మనిషి తోడేలుగా మారడం వింతగా ఉన్నా తోడేలుగా కనిపించే మనుషులు మన మధ్య కొందరున్నారు. ఆ మృగాలమాదిరి పీక కొరికి రక్తం తాగరు వాళ్లు. అందుకు బదులుగా చాలా కష్టాలు, అవమానాలు ఎదుర్కొంటుంటారు. ఒళ్లంతా బొచ్చుతో నరకం అనుభవిస్తుంటారు. చూడ్డానికి భయంకరంగా కనిపిస్తున్నా వాళ్లూ అచ్చం మనలాంటి మనుషులే.
మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లా నంద్లేటా గ్రామానికి చెందిన లలిత్ పటీదార్ అనే టీనేజర్ పరిస్థితి అచ్చం అలాంటిందే. ఒళ్లంతా వెంట్రుకలు మొలిచే ‘వర్‌ఊల్ఫ్ సిండ్రోమ్’ జబ్బుతో బాధపడుతున్నాడు అతడు.

పుట్టినప్పుడు డాక్టర్ వెంట్రుకలను షేవ్ చేశాడు. పెద్దయ్యాక పోతాయని అనుకున్నారు. పోకపోగా మరింత పెరిగాయి. ఆరేళ్ల వయసు నుంచి సమస్య మరింత తీవ్రమైంది. మొత్తం శరీరాన్ని, ముఖాన్ని మొత్తం జుట్టు కమ్మేయడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. జనం అతణ్ని కోతి అని, తోడేలు అని ఎగతాళి చేస్తున్నారు. పిల్లలు రాళ్లతో కొడుతున్నారు. షేవింగ్, కాస్మెటిక్స్ వంటి వాటితో పటీదార్ జబ్బు నయం కావడం లేదు. పేద రైతుకుటుంబానికి చెందిన అతనికి ఖరీదైన వైద్యం చేసుకునే స్తోమత లేదు. ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న పటీదార్ తనకు ప్రభుత్వం ఏదైనా సాయం చేయాలని కోరుతున్నాడు. ‘‘నాలాంటి వాళ్లు 50 మందే ఉన్నట్లు చెబుతున్నారు. నా జీవితమంతా ఇలా బాధపడాల్సిందేనా? ఎన్నిసార్లు షేవింగ్ చేసుకున్నా ఏం లాభం? పిల్లలు నన్ను చూసి జంతువని జడుసుకుంటున్నారు. ఈ జీవితానికి అలవాటుపడుతున్నాను. ఇతరులకు భిన్నంగా ఉండడం సమస్య కాదని సరిపెట్టుకుంటున్నాను’’ అని అంటున్నాడు పటీదార్.