యూరియా కోసం రైతుల ధర్నా.. ఎమ్మెల్యే ఆదేశాలతో లూటీ - MicTv.in - Telugu News
mictv telugu

యూరియా కోసం రైతుల ధర్నా.. ఎమ్మెల్యే ఆదేశాలతో లూటీ

November 12, 2022

యూరియా కోసం రైతులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఉమ్మడి ఏపీలో అయితే రైతులు పొలాలను వదిలేసి యూరియా ఎరువుల కోసం షాపుల ముందు పడిగాపులు కాసేవారు. తమ వంతు వచ్చేవరకు ఎండలో నిలబడలేక చెప్పులను వరుస క్రమంలో పెట్టి వేచి ఉండేవారు. ఇప్పుడంటే ఆ దృష్యాలు తెలుగు రాష్ట్రాల్లో కనిపించడం లేదు కానీ, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ అలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయనడానికి ఈ తాజా సంఘటన ఓ ఉదాహరణ. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌‌లో ఓ ఎరువుల దుకాణం ముందు రైతులు యూరియా కోసం వేచి చూస్తుండగా, అధికారులు సర్వర్లు పని చేయడం లేదని పంపిణీ ఆపేశారు.

దీంతో ఆందోళనకు గురైన రైతులు ధర్నా చేపట్టగా, అటుగా వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విషయం ఏంటని ఆరా తీయడంతో రైతులు తమ ఇబ్బందిని ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు మాత్రం ఆన్ లైన్ సమస్య కారణంగా యూరియా పంపిణీ చేయలేకపోతున్నామని, ఒక్కరోజులో సరిచేసి పంపిణీ చేస్తామని సర్దిచెప్పారు. అధికారులు చెప్పింది విన్న ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రైతుల వైపు తిరిగి లూటీ చేయమని చెప్తూ షట్టర్ ఓపెన్ చేశారు. అంతే.. ఒక్కసారిగా లోపలికి వెళ్లిన రైతులు అందినకాడికి యూరియా బస్తాలను ఎత్తుకెళ్లారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడగా, లూటీకి సహకరించిన ఎమ్మెల్యేపై కూడా ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా మరో కేసు నమోదు చేశారు. దీనిపై స్పందిచిన సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యే తన అభిప్రాయాన్ని వీడియో రూపంలో విడుదల చేశారు. అందులో తనపై నమోదైన కేసులను ఫేక్‌గా కొట్టిపారేశారు. ఇలాంటి వాటికి తాను భయపడనని, రైతుల కోసం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. కలెక్టర్, ఎస్పీలు కలిసి ఫేక్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆరోపించారు.