Madhya Pradesh government has registered a case against three journalists
mictv telugu

తోపుడు బండిపై వృద్ధుడి తరలింపు.. జర్నలిస్టులపై కేసు

August 22, 2022

Madhya Pradesh government has registered a case against three journalists

అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో వృద్ధుడిని ఆస్పత్రికి తోపుడు బండిలో ఓ కుటుంబం తరలించింది. దీనిని ఫోటో తీసి రాష్ట్రంలో ఆరోగ్య సేవలు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో ఎత్తి చూపుతూ ముగ్గురు జర్నలిస్టులు వార్త రాశారు. దాంతో కోపమొచ్చి జిల్లా యంత్రాంగం ముగ్గరు జర్నలిస్టులపై కేసు నమోదు చేసింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న గయా ప్రసాద్ (76)ని అతని కుటుంబం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలనుకుంది.

దాని కోసం అంబులెన్స్‌కు ఫోన్ చేయగా, ఫలితం లేకపోవడంతో తోపుడు బండిపై తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జర్నలిస్టులు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు అందడం లేదని ఆగస్ట్ 15న వార్త ప్రచురించారు. వార్తపై స్పందించిన జిల్లా యంత్రాంగం ఇందులో నిజానిజాలను వెలికితీయాలని కమిటీని వేసింది. కమిటీ నివేదిక ప్రకారం అది తప్పుడు వార్త అని, ఆ కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని తేలింది. దీంతో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా వార్తలు రాసిన జర్నలిస్టులపై ఆగ్రహించిన అధికారులు వారిపై కేసులు నమోదు చేశారు. దీనిపై స్పందించిన జర్నలిస్టులు వారి కుటుంబంపై ఒత్తిడి తెచ్చి అలా చెప్పించారని, మేం నిజమైన వార్త రాశామని ఆవేదన వ్యక్తం చేశారు. అటు ప్రతిపక్ష నేత అధికారుల తీరుపై మండిపడ్డారు. మీడియా గొంతును అణచివేస్తున్నారని విమర్శించారు. విచిత్రంగా బీజేపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు జర్నలిస్టులకు మద్ధతు తెలిపారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.