ద్యావుడా.. ఒకేసారి ఇద్దరికీ తాళి కట్టేశాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

ద్యావుడా.. ఒకేసారి ఇద్దరికీ తాళి కట్టేశాడు..

July 10, 2020

Marries

ఓ పెళ్లి కొడుకు ఒకే మండపంలో ఒకేసారి ఇద్దరికి తాళి కట్టేశాడు. పెద్దలు కుదిర్చిన అమ్మాయి మెడలోనే కాదు.. తాను ప్రేమించిన యువతి మెడలోనూ అదే మండపంలో తాళి కట్టాడు. ఈ విచిత్రమైన పెళ్లి మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో జరిగింది. సందీప్ ఉయికే అనే యువకుడు భోపాల్‌‌లో చదువుకునేవాడు. ఆ సమయంలో హోశంగబాద్‌కు చెందిన యువతిని ప్రేమించాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ, అతని కన్నవాళ్లు అందుకు అభ్యంతరం వ్యక్తంచేశారు. తాము చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని భీష్మించుక్కూర్చున్నారు. తన అనుమతి లేకుండానే అమ్మానాన్నలు అమ్మాయి అమ్మానాన్నలకు పెళ్లి చేస్తామని మాటిచ్చారు. దీంతో సరేనని తల్లిదండ్రుల మాటకు విలువ ఇచ్చాడు సందీప్. 

హమ్మయ్య కొడుకు పెళ్లికి ఒప్పుకున్నాడనే ఆనందంలో ఆ కన్నవారు పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో సందీప్ ప్లేట్ ఫిరాయించాడు. తన ప్రియురాలిని తప్పా మరెవ్వరినీ పెళ్లి చేసుకోనని మొండికేశాడు. దీంతో యువతి బంధువులు గ్రామ పెద్దలు సందీప్ ప్రియురాలితో సహా మూడు కుటుంబాలను కుర్చోబెట్టి మాట్లాడి సంధి కుదిర్చారు. సందీప్ ప్రియురాలు, సందీప్ పెద్దలు ఎంపిక చేసిన యువతితో కలిసి జీవించేందుకు అంగీకరించింది. దీంతో సందీప్ ఒకే పెళ్లి పందిట్లో తన ప్రియురాలిని, అమ్మానాన్నలు చూసిన యువతి మెడలో రెండు తాళులు కట్టాడు. జన్‌పద్ పంచాయత్ ఘోదాడోంగ్రీ ఉపాధ్యక్షుడు మిశ్రీలాల్ పరాటే ఈ పెళ్లికి పెద్దగా వ్యవహరించారు. మొత్తానికి సందీప్ అటు తన ప్రియురాలిని, ఇటు తన అమ్మానాన్నలు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ, భవిష్యత్తులో వారు సఖ్యంగా కాపురం చేస్తారో లేదో అనే అనుమానాలు పెళ్లికి వచ్చినవారు వ్యక్తంచేశారు.