అంత్యక్రియల్లో 11 మందికి అంటించాడు.. 1500 మందికి టెన్షన్ - MicTv.in - Telugu News
mictv telugu

అంత్యక్రియల్లో 11 మందికి అంటించాడు.. 1500 మందికి టెన్షన్

April 4, 2020

Madhya Pradesh Man Who Threw A Feast For 1,500 Tests Coronavirus.

తెలిసీ తెలియక విదేశాల నుంచి వచ్చిన కొందరు కరోనాను పార్సల్ చేస్తున్నారు. అలాంటి ఘోరమే మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. తల్లి అంత్యక్రియల కోసం దుబాయ్ నుంచి వచ్చాడు. ఇక్కడున్నవారికి కరోనా అంటించాడు. తల్లి దశదిన కర్మలు నిర్వహించాడు. ఆ విందుకు వచ్చి భోజనాలు చేసిన 1500 మంది ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. మోరినా నగరంలోని 47వార్డుకు చెందిన సురేష్ దుబాయ్‌లో ఉంటున్నాడు. తన తల్లి మరణవార్త విన్న అతడు వెంటనే మార్చి 17న స్వదేశానికి తిరిగి వచ్చాడు. తల్లి అంత్యక్రియలకు బంధుమిత్రులు, స్థానికులు హాజరయ్యారు. దశదిన కర్మలు చేశాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి సురేష్, అతని భార్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయగా.. వారిద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. అనుమానం వచ్చిన అధికారులు అతని కుటుంబ సభ్యులకు(23 మందికి) కూడా పరీక్షలు నిర్వహించగా 11 మందికి(మహిళలు) కరోనా పాజిటివ్ అని తేలింది. నెగెటివ్ తేలిన మిగతావారిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచారు.

 భోజనాలు చేసిన 1500 మంది బంధుమిత్రులు, స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమకూ కరోనా సోకిందేమోనని కంటిమీద కునుకులేకుండా ఆందోళన చెందుతున్నారు. యుద్ధ ప్రతిపాదికన అధికారులు విందు ఇచ్చిన ప్రాంతం మొత్తాన్ని సీల్ చేశారు. విందుకు హాజరైన వారు ఎవరినీ కలవకూడదని చెప్పారు. సురేష్ దుబాయ్‌లో వెయిటర్‌గా పని చేస్తాడు. సురేష్ దుబాయ్ నుంచి వచ్చినప్పుడు అతడిలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు. మొరేనాకు వచ్చే ముందు తన భార్య అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సురేష్ చెప్పాడు. అయితే దుబాయ్‌ నుంచి బయల్దేరేముందే అతనికి వైరస్‌ సోకిందని వైద్యులు చెబుతున్నారు.