కాల్ సెంటర్ ఉద్యోగికి ఐటీ షాక్.. రూ.3.5కోట్ల పెనాల్టీ నోటీసు! - MicTv.in - Telugu News
mictv telugu

కాల్ సెంటర్ ఉద్యోగికి ఐటీ షాక్.. రూ.3.5కోట్ల పెనాల్టీ నోటీసు!

January 16, 2020

fjgf

ఈమధ్య ఆదాయపన్ను శాఖ చిత్రవిచిత్రాలకు పాల్పడుతోంది. మూలిగే నక్క మీద తాటికాయలు పడ్డట్టు కాకుండా వేసినంత పనే చేస్తోంది. హైదరాబాద్‌కు చెందిన బాబాసాహెబ్ అహీర్ అనే కూలీకి రూ. కోటి పన్ను కట్టాలని నోటీసులు పంపించింది. అతను రోజుకు సంపాదించేదే రూ.300లు. రెక్కాడితేగాని డొక్కాడని ఆయన అంత పన్ను ఎలా కడతానని పోలీసులను ఆశ్రయించాడు. ఇదిలావుండగా ఆదాయపన్ను శాఖ మరో సామాన్యుడికి షాక్ ఇచ్చింది. మధ్యప్రదేశ్ బింద్ జిల్లాలో కాల్ సెంటర్‌లో పనిచేసే ఉద్యోగికి రూ.3.49కోట్ల పెనాల్టీ నోటీసు పంపింది. జనవరి 17లోపు ఆ నగదు చెల్లించాలని నోటీసులో పేర్కొంది. దీంతో బాధితుడికి కాసేపటివరకు మెదడు పనిచేయలేదు. షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది.

బింద్‌ జిల్లాకు చెందిన రవి గుప్తా అనే వ్యక్తి పంజాబ్‌లో నివాసం ఉంటున్నాడు. అతడు ఓ బీపీవో సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతడికి ఆదాయ పన్ను శాఖ నుంచి ఓ నోటీసు వచ్చింది. అందులో 2011-12 సంవత్సరంలో తన పాన్‌ నంబర్‌ మీద రూ.132 కోట్ల లావాదేవీలు జరిపినట్లు.. అందుకు గానూ రూ.3.49కోట్ల పెనాల్టీ చెల్లించాలని పేర్కొంది. పన్ను చెల్లించకపోతే రుణం ద్వారా కొన్న అతని ఇంటిని జప్తు చేస్తామని నోటీసులో పేర్కొంది. అది చూసి అతనికి కళ్లు బైర్లు కమ్మినంత పని అయింది. ఏం చెయ్యాలో తోచక ఈ విషయాన్ని ఐటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. తన పాన్ నంబర్‌తో ఎవరో ఖాతా తెరిచి ఆ లావాదేవీలకు పాల్పడ్డారని చెప్పాడు. ఫలితం లేకపోవడంతో తానే నేరుగా విచారణ చేసి నిజం తెలుసుకున్నాడు. 

ముంబయిలో స్థాపించిన ఓ సూరత్‌ బేస్‌ వజ్రాల కంపెనీ తన పాన్‌ నంబర్‌పై నకిలీ ఖాతా తెరిచి లావాదేవీలు జరిపినట్లు గుర్తించానని అన్నాడు. కొన్ని లావాదేవీల తర్వాత ఆ ఖాతాను తొలగించినట్లు తెలిసిందని ఆరోపించాడు. నిందితులు ఎవరో తనకు తెలియదని చెప్పాడు. ఇప్పుడు తాను పెనాల్టీ చెల్లించకపోతే.. తన ఇంటిని ఐటీ శాఖ వారు జప్తు చేస్తారేమోనని రవి గుప్తా ఆందోళన చెందుతున్నాడు.