దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన కేజీఎఫ్ సిరీస్ సినిమాలు దక్షిణాది చిత్రాల స్టామినాను మరోసారి చాటిచెప్పింది. దీంతో పాటు సినిమా ప్రభావం యువతపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తాజా సంఘటన ద్వారా వెల్లడైంది. ఈ సినిమాను స్పూర్తిగా తీసుకొని పంతొమ్మిదేళ్ల యువకుడు వరుస హత్యలకు పాల్పడ్డాడు. పోలీసులు పట్టుకోగా, డాన్‌గా ఎదిగడమే లక్ష్యంగా ఈ పని చేసినట్టు ధైర్యంగా చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన ఈ వరుస హత్యల వివరాలు ఇలా ఉన్నాయి.
మధ్యప్రదేశ్‌లోని సాగర్ ప్రాంతానికి చెందిన శివప్రసాద్ అనే యువకుడికి సినిమాలు విపరీతంగా చూసే అలవాటుంది. ఈ క్రమంలో కేజీఎఫ్ సిరీస్ సినిమాలను తెగ చూసి అందులో హీరోలా ఎదగాలని ప్లాన్ వేశాడు. అందుకు కాపలా కాసే సెక్యూరిటీ గార్డులను టార్గెట్ చేసి వరుసగా మూడు రాత్రుల్లో మూడు హత్యలు చేశాడు. మే నెలలోనూ ఓ హత్య చేశాడు. తాజాగా గతరాత్రి భోపాల్‌లో నిద్రిస్తున్న ఓ సెక్యూరిటీ గార్డును చంపి అతని మొఖంపై బూటు పెట్టి కవర్ చేశాడు.
ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డవడంతో అప్రమత్తమైన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సెల్‌ఫోన్ కూడా చోరీ చేసినది కావడం గమనార్హం. విచారణలో కేజీఎఫ్‌తో పాటు తన తదుపరి టార్గెట్ పోలీసులే అని చెప్పడంతో ఒక్కసారిగా ఖంగుతినడం పోలీసుల వంతైంది.