బజారుకెక్కాను.. నేను ఈ దేశానికి శత్రువును.. - MicTv.in - Telugu News
mictv telugu

బజారుకెక్కాను.. నేను ఈ దేశానికి శత్రువును..

March 23, 2020

jfbrgg

కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్‌ను అతిక్రమించి రోడ్లమీదకు రయ్యున వస్తున్నవారని రావద్దు మొర్రో అని పోలీసులు దండం పెడుతున్నా వినట్లేదు. దీంతో ఇప్పటికే తెలంగాణ పోలీసులు అలాంటివారికి వారం రోజుల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. అయితే మధ్య ప్రదేశ్ పోలీసులు మాత్రం అలాంటివారిపై వినూత్న చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం విధించిన సెక్షన్ 144ను అతిక్రమించిన వారిని నడిరోడ్డుపై నిలబెట్టి షేమింగ్ ప్లకార్డులను చేతిలో పెడుతున్నారు. ఆ ఫ్లకార్డులపై ఏం రాసి ఉందంటే.. ‘నేను ఈ సమాజానికి శత్రువును. ఇంటిపట్టున ఉండను’ అని రాసి ఉంది. ఈ ప్లకార్డులను ప్రదర్శిస్తుండగా వారిని పోలీసులు ఫోటోలు తీసుకుంటారు.

jfbrgg

దీనిపై మధ్య ప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..‘ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నవాళ్లపై ఈ చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలను ఇళ్లలో ఉండేలా చూసే సామాజిక ప్రయోగం ఇది’ అని తెలిపారు. కాగా, నిన్న ఉత్తర ప్రదేశ్ పోలీసులు కూడా జనతా కర్ఫ్యూ సందర్భంగా ఇలాంటి చర్యలే తీసుకున్నారు. ప్లకార్డులను బయటి తిరిగేవాళ్లకు పంచిపెట్టారు. ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’ సందర్భంగా దేశ ప్రజలంతా ఇళ్లలో ఉండి సంఘీభావం ప్రకటించారు. కొందరు మాత్రం ఇవేమీ పట్టనట్టు అవసరం లేకున్నా రోడ్లపై తిరుగుతూ కనిపించడంతో యూపీ పోలీసులు ఈ చర్యలకు పూనుకుంది.