Madhya Pradesh school students write using both hands
mictv telugu

ఒకేసారి రెండు చేతులతో రాసేస్తారు!

November 16, 2022

త్రీ ఇడియట్స్ సినిమా గుర్తుందా? అందులో ప్రిన్సిపల్ పాత్రధారి ఒకేసారి రెండు చేతులతో రాస్తుంటాడు. అది చూసి షాక్ అయ్యాం. ఇలా కూడా రాసే వాళ్లుంటారా అనుకున్నాం. కానీ వందమంది విద్యార్థులు ఇప్పుడు అది చేసి చూపిస్తున్నారు.

ప్రపంచంలో కుడిచేతితో రాసే వాళ్లే ఎక్కువ. పదిశాతం మంది మాత్రం ఎడమ చేతివాటం ఉంటుంది. కానీ కోటిలో ఒక్కొరికే రెండు చేతులతో రాసే అదృష్టం ఉంటుందని మీకు తెలుసా? బరాక్ ఒబామా, ఒప్రా విన్ఫ్రే, మన మాజీ రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ ఇలా కొంతమంది రెండు చేతులతో ఏకకాలంలో రాయగలరు. ఈ యూనిక్ స్కిల్ అందరికీ అబ్బదని అనుకుంటారు. కానీ సాధ్యం కానిదేదీ లేదని కొందరు విద్యార్థులు నిరూపిస్తున్నారు.

ఐదు భాషల్లోనూ..

మధ్యప్రదేశ్లోని సింగ్రులీ దగ్గర బుదేలి అనే గ్రామం. అక్కడ 1999లో వీణ వాదిని స్కూల్ని ప్రారంభించారు. అక్కడకి విరంగడ్ అని ప్రిన్సిపల్ వచ్చాక అక్కడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆయన వచ్చాక ఐదు భాషలు నేర్చుకునేలా శిక్షణ ఇప్పిస్తున్నాడు. హిందీ, సంస్కృతం, ఇంగ్లిష్, ఉర్దూ, స్పానిష్ భాషలను అక్కడి విద్యార్థులు అనర్ఘళంగా మాట్లాడగలరు. అంతేకాదు.. ఒకేసారి రెండు చేతులతో రాసేలా శిక్షణ ఇప్పించింది కూడా ఆయనే. మన మాజీ రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ గారి స్ఫూర్తితోనే చేశామంటున్నాడు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ విరంగడ్ శర్మ. రోజు తరగుతులతో పాటు రోజుకో గంట మెడిటేషన్, యోగ క్లాసులు చెబుతారు. ప్రస్తుతం అక్కడి పిల్లలు ఒక్క నిమిషంలో 250 పదాలను ఒకేసారి రెండు చేతులతో రాయగలరని చెబుతున్నాడు. ‘మొదట నేను కుడి చేతితో రాసేవాడిని. మూడవ తరగతిలో ఎడమ చేతితో రాయడం ప్రారంభించాను. కొద్ది రోజులకే రెండు చేతులతో ఒకేసారి రాయడం కూడా అలవాటయింది’ అని అంటున్నాడు ఎనిమిదవ తరగతికి చెందిన పంకజ్ యాదవ్. 1999 నుంచి ఇప్పటివరకు 480మంది విద్యార్థులు రెండు చేతులతో రాయడంలో నిష్ణాతులయ్యారు.

రీసెర్చ్ కూడా..

‘మన మెదడు రెండు భాగాలుగా విడిపోయి ఉంటుంది. ఒకేసారి రెండు పనిచేయవు. కానీ పనిచేసేలా మన బ్రెయిన్ని ట్రెయిన్ చేయాల్సి ఉంటుంది. అది అక్కడి టీచర్లు చేస్తున్నారు. పిల్లల్లో ఉన్న ప్యాషన్ని గమనించి ఇలా రెండు చేతులతో రాసేలా చేస్తున్నారు’ అంటున్నాడు సైకలాజిస్ట్ అశిష్ పాండే. వీరు ఈ నైపుణ్యం ఎలా చేస్తున్నారని కొందరికీ అనుమానం వచ్చింది. అందుకే సౌత్ కొరియన్ పరిశోధకులు రెండు సంవత్సరాల పాటు ఈ విద్యార్థులపై పరిశోధనలు కూడా జరిపారు. వీరి అద్భుతమైన ప్రతిభను చూసి వాళ్లు కూడా ఆశ్చర్యపోయారట.