ఆధార్ కార్డు ప్రాముఖ్యత ఎంత ఉందో మనకు తెలిసిందే. ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకం కావాలన్నా ఆధార్ తప్పనిసరి. అందుకోసమే కాకుండా ఓ గుర్తింపు కార్డుగా పనికి వస్తుంది. దేనికైనా సరే ఆధార్ ఉంటే చాలు అనుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఆధార్ కార్డు ఉంటేనే పానీపూరి ఇస్తారని తెలుసా? ఓ వ్యాపారి ఈ కండీషన్ పెట్టాడు.
దీనికి అతను చెప్పిన కారణం వింతగా ఉన్నా అతని ఉద్దేశాన్ని మాత్రం తప్పుపట్టలేము. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్తున్నాడు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ – భింద్ రహదారిలో ఛోటేలాల్ భఘేల్ భగత్ జీ పానీపూరి బండి నిర్వహిస్తున్నాడు. అక్కడ పానీపూరి తినాలంటే ఎవరైనా ఆధార్ కార్డు చూపించాలి. ఎందుకంటే ఇక్కడ కేవలం 18 నుంచి 50 ఏళ్ల లోపు వయసున్న వారికి మాత్రమే పానీపూరి అమ్ముతారు. పిల్లలు, వృద్ధులు, గర్భంతో ఉన్న మహిళలకు పానీపూరీ ఇవ్వరు. ఈ విషయాన్ని ఓ బోర్డుపై రాసిపెట్టాడు ఛోటేలాల్. తన వద్ద పానీపూరి మంచి రుచిగా ఉంటుందని, తాను తయారు చేసిన మసాలా కాస్త ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు, వృద్ధులు, గర్భంతో ఉన్న మహిళలకు అది మంచిది కాదని చెప్తున్నాడు. ఈ ఘాటును వారు భరించలేరని స్పష్టంగా చెప్పేస్తున్నాడు. ముఖ్యంగా గర్భిణీలు తన వద్ద పానీపూరీని అస్సలు తినవద్దని సూచిస్తున్నాడు. ఇదంతా కస్టమర్లకు చెప్పలేక బోర్డు మీద రాయించి పెట్టానన్నాడు. అయితే ఏ మసాలా వాడతావు? అనేదానికి రహస్యం అని బదులిచ్చాడు. అది తన వ్యాపార రహస్యమని, బయటికి చెప్పకూడదంటున్నాడు. 20 ఏళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నానని, తన వద్ద ఒకసారి రుచి చూసిన వారు మళ్లీ మళ్లీ వస్తారని సంతోషంతో చెప్తున్నాడు. ఏది ఏమైనా పానీపూరికి ఆధార్ నిబంధన ఆశ్చర్యంగా ఉంది కదూ.