బాలికకు 168 చెంపదెబ్బలు.. టీచర్‌కు జైలు.. - MicTv.in - Telugu News
mictv telugu

బాలికకు 168 చెంపదెబ్బలు.. టీచర్‌కు జైలు..

May 16, 2019

హోంవర్క్ చేయలేదన్న కోపంతో ఓ ఉపాధ్యాయుడు ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల కఠినంగా వ్యవహరించాడు. అతను కొట్టడమే కాకుండా తోటి విద్యార్థులతో 168 చెంపదెబ్బలు కొట్టించాడు. గతేడాది మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, తాజాగా ఆ టీచర్‌ను పోలీసులు కటకటాల వెనకకు నెట్టారు.

ఝాబువా జిల్లా థండ్లా తహసీల్‌లోని జవహార్‌ నవోదయ పాఠశాలలో  ఓ బాలిక ఆరవ తరగతి చదువుతోంది. అనారోగ్యం కారణంగా ఆ బాలిక పది రోజులు(గతేడాది జనవరి 1 నుంచి 10 వరకు) బడికి వెళ్లలేదు. 11న స్కూలుకు వెళ్లిన బాలికపై ఆగ్రహం వ్యక్తం చేశాడు టీచర్ మనోజ్ వర్మ. ఇన్ని రోజులు స్కూలుకు రాకపోవడమే కాకుండా, హోంవర్క్ కూడా పూర్తి చేయలేదని బాలిక చెంప వాయించాడు. అంతటితో ఆగకుండా తోటి విద్యార్థినులతో బాలికను 168 సార్లు చెంప దెబ్బలు కొట్టించాడు. ఆరు రోజుల్లో రోజుకు రెండుసార్లు ఇలా ఆమెను శిక్షించాలంటూ 14 మంది బాలికలకు చెప్పాడు. బాలిక చెంపలు ఎర్రగా వాచిపోయాయి. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పాఠశాల యాజమాన్యం సదరు ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించింది. అయితే ఈ కేసులో కొసమెరుపు ఏంటంటే.. ఫిర్యాదు చేసిన దాదాపు ఏడాదిన్నర తర్వాత సదరు ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. గత సోమవారం మనోజ్‌ వర్మను అరెస్టు చేసిన పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో అతడు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా న్యాయస్థానం తిరస్కరించి 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది.