పాక్ ప్రధానికి మధ్యప్రదేశ్ టమాటా రైతుల వింత ఆఫర్ - MicTv.in - Telugu News
mictv telugu

పాక్ ప్రధానికి మధ్యప్రదేశ్ టమాటా రైతుల వింత ఆఫర్

November 26, 2019

పాకిస్తాన్‌లో టమాటా ధరలు అక్కడి ప్రభుత్వానికి సంకటంగా మారాయి. దిగుబడిలేక ధరలు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. టమాటా కొనాలంటేనే భయపడిపోతున్నారు. ఈ సమయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు మధ్యప్రదేశ్ టమాటా రైతులు అనుకోని ఆఫర్ ఇచ్చారు. అక్కడి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని జబువా రైతు సంఘం ఓ లేఖను పంపింది దీంట్లో  తాము టమాటాలు పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే దీనికి కొన్ని షరతులు ఉన్నాయని వాటిని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఇమ్రాన్‌కు ఉచిత సలహాలు ఇస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. 

Madhya Pradesh.

దాయాది దేశం కావడంతో తమ వద్ద ఉన్న పంటను దిగుమతి చేస్తామని ఆ లేఖలో రైతులు పేర్కొన్నారు. తాము పెట్టిన షరుతులు మాత్రం ఇమ్రాన్ ఒప్పుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అదేంటంటే.. పాక్‌లో తలదాచుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను భారత్‌కు అప్పగించడం. ఉగ్రవాదులకు సాయం చేసి 26/11 ముంబై దాడులకు తెగబడినందుకు క్షమాపణ చెప్పాలని కోరారు. వీటిని అంగీకరిస్తేనే తాము పంట పంపిస్తామని లేదంటే కుదరదని చెప్పారు. ఇమ్రాన్ నిర్ణయం వల్ల అక్కడ ధరలు దిగిరావడంతో పాటు రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయని వీటిని ఆయన దృష్టిలో పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. 

కాగా చాలా కాలంగా  జబువాలోని పలు ప్రాంతాల నుంచి టమాటా రైతులు పాకిస్తాన్‌కు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా రైతులు ఎగుమతులు నిలిపివేశారు. దీంతో అక్కడ కొరత భారీగా ఏర్పడటంతో కిలో టమాటా రూ. 400 పలుకుతోంది. సామాన్యుడే కాదు ధనవంతులు కూడా కొనలేని స్థాయికి చేరిపోయింది. ఈ నేపథ్యంలోనే అక్కడి రైతులు ఇలా తమ డిమాండ్ల చిట్టా పంపారు. కాగా ఇటీవల ‘పీవోకే ఇచ్చి.. టమాటాలు తీసుకెళ్లు’ అనే నినాదంతో నిరసన కూడా చేపట్టారు అక్కడి రైతులు. మరి దీనిపై పాక్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.