మద్రాస్ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. తమిళనాడులోని అన్ని ఆలయాల్లోనూ సెల్ ఫోన్లను నిషేధించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆలయాల యొక్క స్వచ్ఛత..పవిత్రతను పరిరక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తెలిపింది. తూత్తుకుడి జిల్లా తిరుచేందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో భక్తులు సెల్ఫోన్లు ఉపయోగించకుండా నిషేధం విధించాలని కోరుతూ అర్చకుడు ఎం.సీతారామన్ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు విన్న ధర్మాసనం ఈ కీలక తీర్పును వెల్లడించింది.
ఆలయానికి వచ్చిన భక్తులు తమ సెల్ఫోన్లలో దేవతామూర్తుల ఫొటోలు తీస్తున్నారని, వీడియోలు చిత్రీకరిస్తున్నారని, పూజలను కూడా రికార్డు చేస్తున్నారనే పిటిషనర్ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. అయితే దేవాలయాలు బయట భక్తుల మొబైల్స్ ఫోన్స్ ను భద్రపరిచేందుకు స్టాండ్లు, లాకర్లు, టోకెన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ ఆదేశాలన్నీ హిందూమత, ధర్మాదాయ శాఖ పరిధిలోకి వచ్చే ఆలయాల్లో అమలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దేవాలయాలను సందర్శించే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేస్తున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.