లాయర్‌కు రూ. 5 లక్షల జరిమానా..  - MicTv.in - Telugu News
mictv telugu

లాయర్‌కు రూ. 5 లక్షల జరిమానా.. 

October 13, 2020

Madras high court imposes Rs 5 lakh cost on lawyer.

సంచలన తీర్పులకు కేరాఫ్ అడ్రెస్ అయిన మద్రాస్ హైకోర్టు మరో సంచలనం తీర్పు ఇచ్చింది. లాయర్‌కు ఏకంగా రూ. 5 లక్షల జరిమానా విధించింది. లాయర్ సతీశ్ కుమార్‌ హైకోర్టులో విజిలెన్స్ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న ఆర్ పూర్ణిమపై అసత్య ఆరోపణలు చేశాడు. పూర్ణిమ ఇంటర్మీడియట్ పరీక్షలు రాయకుండానే ఓపెన్ యూనివర్శిటీలో డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత మైసూరు యూనివర్శిటీలో లా డిగ్రీ పొందారని ఆరోపించాడు. అందుకే ఆమెను విజిలెన్స్ రిజిస్ట్రార్‌ విధుల నుంచి తొలగించాలని పిటిషన్ వేశాడు. 

దీనిపై ఏపీ సాహి నేతృత్వంలోని ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. ఆ విచాణలో పూర్ణిమ తాను 1984లో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో 711 మార్కులతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనట్టు మార్కుల జాబితాను న్యాయమూర్తికి చూపించారు. ఆ సర్టిఫికెట్లను న్యాయమూర్తి లాయర్ సతీష్ కుమార్‌కు చూపించారు. అలాగే మహిళా ఉద్యోగిపై తప్పుడు ఆరోపణలతో పిటిషన్ వేసి, కోర్టు సమయాన్ని వృథా చేశారని న్యాయమూర్తి సాహి లాయర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు లక్షల రూపాయల జరిమానాతో పాటు లాయర్ సతీశ్‌పై కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కేసు నమోదు చేశారు. ఈనెల 20న విచారణకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు.