Madras High Court ordered hero Vishal to submit details of assets
mictv telugu

హీరో విశాల్‌కు హైకోర్టులో చుక్కెదురు.. ఆస్తి వివరాలపై ఆదేశం

September 10, 2022

Madras High Court ordered hero Vishal to submit details of assets

తమిళ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రుణం చెల్లించని కేసులో ఆయనకున్న ఆస్తుల వివరాలను కోర్టుకు దాఖలు చేయాలంటూ అందుకు రెండు వారాల గడువిచ్చింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. హీరో విశాల్ తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై సినిమాలు నిర్మించేందుకు గోపురం ఫిల్మ్స్ నుంచి రూ. 21 కోట్ల 29 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అయితే తర్వాత విశాల్‌కు, ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ లైకాకు ఒప్పందం జరగడంతో ఆ అప్పును లైకా చెల్లించింది.

ఈ అప్పు తీరేంతవరకు విశాల్ ఫిల్మ్ బ్యానర్‌పై నిర్మించే అన్ని చిత్రాల హక్కులను లైకాకు ఇస్తానని విశాల్ హామీ ఇచ్చాడు. కానీ, విశాల్ సినిమా హక్కులు ఇవ్వకపోగా, అప్పు కూడా చెల్లించకపోవడంతో లైకా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. వీరమే వాగై చూడుమ్ సినిమా విడుదలను ఆపాలంటూ కేసు వేసింది. విశాల్ తరపున రూ. 15 కోట్లు మొదటి విడతగా డిపాజిట్ చేయాలని పిటిషన్‌లో కోరింది. దీంతో కోర్టు విచారణ జరపగా.. ఒకేరోజు రూ. 18 కోట్లు నష్టపోవడంతో అప్పు చెల్లించలేకపోయినట్టు విశాల్ కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంలో కోర్టు జోక్యం చేసుకుంటూ.. అప్పు చెల్లించే ఉద్దేశం ఉందా? లేదా? అంటూ మండిపడింది. అంతేకాక, సెప్టెంబర్ 9 లోపు ఆస్తుల వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. తాజాగా శుక్రవారం కోర్టు విచారణ జరపగా, విశాల్ కోర్టుకు రాకపోవడంతో న్యాయవాది విన్నపం మేరకు గడువును రెండు వారాలు పొడగించి తదుపరి విచారణను సెప్టెంబర్ 23కి వాయిదా వేశారు.