పెళ్లికాని జంట ఒకే లాడ్జి గదిలో ఉండొచ్చు..మద్రాస్ హైకోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లికాని జంట ఒకే లాడ్జి గదిలో ఉండొచ్చు..మద్రాస్ హైకోర్టు

December 8, 2019

 

Madras High Court01

పెళ్లికాని జంట ఒకే లాడ్జి గదిలో ఉండటం నేరం కాదని మద్రాసు హైకోర్టు తీర్పును వెలువరించింది. ఈ ఏడాది జూన్‌లో కోయంబత్తూరులోని ఓ లాడ్జిపై పోలీసులు, రెవెన్యూ అధికారులు రైడ్ నిర్వహించారు. ఆ సమయంలో ఓ లాడ్జిలో ఓ గదిలో పెళ్లికాని జంటను, మరో గదిలో మద్యం సీసాలను గుర్తించారు. దీంతో ఆ లాడ్జిని అధికారులు సీజ్ చేశారు. లాడ్జి యజమాని అధికారుల చర్యను సవాల్ చేస్తూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఎస్ రమేశ్ ధర్మాసనం..పెళ్లికాని జంట ఒకే గదిలో ఉండటం నేరం కాదని వ్యాఖ్యానించింది. ఒకే గదిలో అవివాహిత జంట ఉందని.. పోలీసులు చెప్పే కారణాలతో ఏకీభవించలేమన్నారు. అవివాహిత స్త్రీ, పురుషులు ఒకే గదిలో ఉండకూడదని చట్టం లేని యెడల అది ఎలా తప్పవుతుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇద్దరు వయోజనులు ఇష్టపూర్వకంగా కలిసి ఉండటాన్ని నేరంగా ఎలా పరిగణించలేమో, అలాగే లాడ్జిలోని ఒకే గదిలో పెళ్లికాని జంట ఉండటాన్ని నేరంగా చూడలేమని స్పష్టం చేశారు.

అలాగే, లాడ్జి గదిలో మద్యం సీసాలు లభించినంత మాత్రానా లాడ్జిలో అక్రమంగా బార్‌ నిర్వహిస్తున్నారని చెప్పలేమన్నారు. తమిళనాడు మద్యపాన చట్టం పౌరులు కొంత మద్యం కలిగి ఉండటానికి అనుమతి ఇచ్చిందన్నారు. అలాగే, ఆ హోటల్‌లో మద్యం సరఫరా చేయకపోయినా అతిథులే స్వయంగా కొనుగోలు చేసుకుంటారని దీన్ని నేరంగా ఎలా పరిగణించలేమని వివరించింది. లాడ్జి మూసివేతలో చట్ట ప్రకారం నిబంధనలు పాటించలేదని, అందువల్ల సీలు తొలగించాలని కోయంబత్తూరు కలెక్టరును మద్రాసు హైకోర్టు ఆదేశించింది.