ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు అనేక సౌకర్యాలతో కూడిన కొలువులు ఇస్తాయన్న సంగతి చాలామందికి తెలిసిందే. ట్రాన్స్పోర్ట్ సర్వీసుతో పాటు ట్రావెల్ అలవెన్స్, ఫుడ్ అలవెన్స్లంటూ ఎంప్లాయిస్ను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తాయి. తాజాగా ఓ ఐటీ కంపెనీ మాత్రం తమ ఉద్యోగుల కోసం ఏడాదికి రెండు సార్లు ఇంక్రిమెంట్లు, సంస్థలో పనిచేసే బ్యాచిలర్ ఉద్యోగులకు పెళ్లి సంబంధాలు, పెళ్లి చేసుకునే ఉద్యోగులకు ప్రత్యేకమైన ఇంక్రిమెంట్లు కూడా ఇస్తామని బంపర్ ఆఫర్లు ప్రకటించింది.
ఐటీ రంగంలో క్వాలిఫైడ్ పర్సన్స్‌కి డిమాండ్ కాస్త ఎక్కువే. వారు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారకుండా కాపాడుకునేందుకు కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అదే కోవలో తమిళనాడులోని మధురైకి చెందిన శ్రీ మూకాంబికా ఇన్ఫో సొల్యూషన్స్ సంస్థ సైతం తన కంపెనీ ఉద్యోగులకు కనివిని ఎరుగని రీతిలో స్పెషల్ ఆఫర్స్ ఇచ్చాయి. యూఎస్‌లో క్లయింట్లకు సాఫ్ట్వేర్ సేవలు అందిస్తున్న ఈ కంపెనీ.. 2006లో శివకాశిలో ప్రారంభమై, క్రమంగా అభివృద్ధి చెంది మదురైకి మారింది. కంపెనీ అభివృద్ధిలో తమ ఉద్యోగులే కీలకమంటున్నారు కంపెనీ ఫౌండర్, సీఈవో సెల్వగణేష్ . అందుకే వారి కోసం ఈ ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు చెప్పారు.
దాదాపు 40 శాతం మంది ఉద్యోగులు తమ కంపెనీ స్థాపించినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారని, వారికి ఎన్నో సౌకర్యాలు కల్పించామని సెల్వ గణేష్ చెప్పారు. తమ కంపెనీలో చేరిన ఉద్యోగికి తొలిరోజు నుంచే ఫిక్స్డ్ ఇంక్రిమెంట్స్ ఉంటాయని చెప్పారు. . పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఇంక్రిమెంట్లు, బోనస్‌లు అందిస్తే ఉద్యోగులు కంపెనీ పట్ల గౌరవంతో ఉంటారని, దాంతో సంస్థ ఉత్పత్తి పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. చెన్నై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగస్థులు సులభంగా దొరుకుతున్నప్పటికీ.. మదురై వంటి టూ-టైర్ సిటీస్‌లో ఆ కొరత ఎక్కువగా ఉందన్నారు.