ఎలాంటి ప్రొడక్ట్ అయినా.. ఏ బ్రాండ్ అయినా సరే సెలబ్రిటీలతో ప్రచారం చేయించడం మామూలే. కానీ మ్యాగీ కొత్తగా ఆలోచించింది. తన వినియోగదారులే తన బ్రాండ్ ను నిలబెట్టేవాళ్లు అనుకుంది. అందుకే వినూత్న ప్రచారం మొదలుపెట్టింది. ఈ ప్రచారం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నది. ‘ఖావో తో మ్యాగీ నూడుల్స్ ఖావో’ అనే నినాదంతో ఈ ప్రచారం చేస్తున్నది మ్యాగీ. దీనికోసం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతం నుంచి నిజమైన వినియోగదారులను ఎంచుకున్నది. వీరిద్వారా కొత్త ప్రకటన ప్రచారాన్ని ప్రారంభించింది. బ్రాండ్ ప్రకారం.. బ్రాండ్ ఐకాన్ గా ఉండాలంటే విశ్వసనీయ వినియోగదారులే సరైనవాళ్లుగా ఎంచుకున్నారు.
తాజా ప్రకటనలో..
గాజీపూర్, జౌన్ పూర్, నలంద, నవాడాతో సహా యూపీ, బీహార్ లోని వివిధ జిల్లాల నుంచి వ్యక్తులు మ్యాగీ నూడుల్స్ తమ జీవితాల్లో అనేక దశాబ్దాలుగా విశ్వాసం, నాణ్యత, ఆనందాన్ని ఎలా తీసుకువచ్చాయో వారి వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు.
‘మా వినియోగదారులు మా నిజమైన ఛాంపియన్స్. వారి ప్రేమ, విశ్వాసం బ్రాండ్ కథనంలో పెద్ద పాత్ర పోషించాయి. ఈ క్యాంపెయిన్ లో ఆ ప్రేమకు వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మా ప్రచారానికి వారే సరైన వారని భావించాం’ అంటూ నెస్లే ఇండియా ఫుడ్స్ బిజినెస్ హెడ్ రజత్ జైన్ అన్నారు. ఈ ప్రచారం సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నది. మరిన్ని బ్రాండ్ కథనాలను ఫీచర్ చేయడానికి కంపెనీ ఆలోచిస్తున్నది. ఈ ప్రచారం చూసినవాళ్లు తమ అనుభవం కూడా అలాగే ఉందని చెప్పకనే చెబుతున్నారు. మరీ మీరూ మ్యాగీ ప్రేమికులైతే ఈ క్యాంపెయిన్ లో మీరూ భాగస్వాములవ్వడానికి సిద్ధంగా ఉండండి. ఏదో ఒకరోజు మీకూ ఈ ఛాన్స్ రావచ్చు.