ఆ చెట్టుకు రోజూ 25వేల మంది కౌగిలింతలు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆ చెట్టుకు రోజూ 25వేల మంది కౌగిలింతలు..

November 8, 2019

ఏదైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్‌కి వెళ్తారు. మూఢనమ్మకాలు ఉన్నవాళ్లు బాబాలు, స్వాముల దగ్గరికి కూడా వెళ్లి తాయత్తులు కట్టుకుంటారు. వివిధ రకాల పూజలు చేస్తుంటారు. కానీ, కొందరు అనారోగ్యం వస్తే ఓ చెట్టు దగ్గరకు వెళ్తున్నారు. పది మందో లేదా వంద మందో కాదు ఏకంగా రోజుకి 20 నుంచి 30 వేల మంది అడవిలో ఉన్న ఓ చెట్టు దగ్గరకు వెళ్తున్నారు. పెద్ద సూపర్ స్పెషలిటీ హాస్పిటల్‌కు వెళ్లినా తగ్గని రోగాలు ఆ చెట్టు దగ్గరకు వెళితే తగ్గిపోతున్నాయట.

‘మహువా’ అని పిలవబడే ఆ చెట్టు మధ్యప్రదేశ్‌లోని సాత్పురా టైగర్ రిజర్వ్‌లో ఉంది. ఆ చెట్టు దగ్గరకు వెళ్లి దానిని హత్తుకుంటే చాలు రోగాలు తగ్గిపోతాయని ప్రచారం జరిగింది. దీంతో ప్రతీ రోజూ ఆ చెట్టు దగ్గరకు వేల మంది వరకు వెళ్తున్నారు. రూప్ సింగ్ ఠాకూర్ అనే ఓ రైతు ద్వారా ఆ చెట్టు గురించి అందరికీ తెలిసింది. దీని గురించి రూప్ సింగ్ మాట్లాడుతూ..’నేను గతంలో కుంటుతూ నడిచేవాడిని. ఒకరోజు పని నిమిత్తం అడవికి వెళ్ళాను. అప్పుడు అనుకోకుండా ఆ చెట్టుని ఆనుకున్నాను. అలా పది నిమిషాలపాటు చెట్టుకు అతుక్కుపోయాను. ఆ తర్వాత నాలో ఏదో మార్పు వచ్చింది. అప్పటినుంచి నేను కుంటకుండా మామూలుగానే నడుస్తున్నాను. ప్రతి ఆదివారం, బుధవారం ఆ చెట్టు దగ్గరకు వెళ్తున్నాను. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను’ అని తెలిపారు. 

https://twitter.com/TOIBhopalNews/status/1192655515588820992

ఈ విషయం స్థానిక మీడియాకు తెలిసింది. దీంతో రూప్ సింగ్‌ను మీడియా సంప్రదించింది. అలా మీడియా ద్వారా ఆ చెట్టు గురించి పేషంట్లకు తెలిసింది. దీంతో రోగాలను తగ్గించుకోవడం కోసం పేషెంట్లు అడవి బాట పట్టారు. వెళ్లి ఆ చెట్టును కావలించుకుంటున్నారు. కొందరైతే వీల్ చైర్లలో ఆ చెట్టు దగ్గరకు వెళ్లి కౌగలించుకుంటున్నారు. అలా వస్తున్న వారికి రోగాలు తగ్గటం మాట ఎంత వరకూ నిజమో గానీ స్థానికంగా వ్యాపారం మాత్రం బాగా పెరిగిపోయింది. వాటర్ బాటిళ్లు, చిరుతిళ్ళు, కొబ్బరి బోండాలు ఇలా ఎవరికి తోచించి వారు అమ్ముకుంటూ వ్యాపారం చేస్తున్నారు. కొందరు ఆ చెట్టు ఫొటోలను కూడా అమ్ముతున్నారు. దీంతో అడవిలో చెత్త భారీగా పెరిగిపోతోంది. భారీ సంఖ్యలో జనం రావడంతో పోలీసులు వచ్చి భద్రత కల్పిస్తున్నారు.