ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్ ఠాక్రే! - MicTv.in - Telugu News
mictv telugu

ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్ ఠాక్రే!

November 26, 2019

Maha Aghadi delegation will stake claim tonight; Uddhav to be sworn-in as CM on 1 December in Mumbai

ఉత్కంఠగా సాగుతున్న మహారాష్ట్ర రాజకీయాలకు ఇక తెర పడనున్నట్టే కనిపిస్తోంది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే దిశగా అడుగులు పడుతున్నాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన ‘మహా వికాస్ అఘాడీ’ నేతగా ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్నారు. మూడు పార్టీల నేతలు, ఎమ్మెల్యేలు ముంబయిలోని ట్రైడెంట్ హోటల్‌లో సమావేశం అనంతరం ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్నారు. 

ఈ సందర్భంగా శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం అభ్రర్థి ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ‘నేను రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందించేందుకు నాకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర నేతలకు ధన్యవాదాలు. ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం, విశ్వాసంతో మేము ఈ దేశానికి కొత్త మార్గనిర్దేశకత్వాన్ని చూపిస్తాం. ప్రజలంతా నాకు అప్పజెప్పిన బాధ్యతలను స్వీకరిస్తున్నా. నేను ఒంటరిని కాదు.. మీరంతా నాతో ఉన్నారు. నిజమైన ప్రజాస్వామ్యం గెలిచిన రోజు ఇదే. మేమంతా కలిసి రాష్ట్రంలో రైతుల కన్నీళ్లు తుడుస్తాం. దేవేంద్ర ఫడ్నవీస్‌ లేవనెత్తిన ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నా. నేను ఎవరికీ భయపడను. అబద్దాలు హిందుత్వంలో భాగం కాదు. మీరు అవసరమైనప్పుడు మమ్మల్ని కలుపుకుంటారు. అవసరం లేనప్పుడు దూరం పెడతారు’ అని ఆయన అన్నారు. 

కాగా, డిసెంబర్ 1న ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. శివసేనకు ఎంతో ప్రత్యేక స్థలమైన శివాజీ పార్కులో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు జరగనున్నట్టు సమాచారం.