అత్త చనిపోయిందని సంబరపడిన కోడలి హత్య - MicTv.in - Telugu News
mictv telugu

అత్త చనిపోయిందని సంబరపడిన కోడలి హత్య

March 14, 2019

’అత్త లేని కోడలత్తమురాలు, కోడల్లేని అత్త గుణువంతురాలూ.. ఆహూ..’ అత్త అంటే కోడళ్ళకు పడదు.. కోడళ్ళంటే అత్తలకు పడదు. కొన్ని చోట్ల అత్తాకోడళ్లు అన్యోన్యంగా వున్న సందర్భాలూ వున్నాయి. అయితే వీరి అనుబంధాన్ని ఆధారం చేసుకుని చాలా సినిమాలు, సీరియళ్లు వచ్చాయి. అత్తపై కోడలు ఎంత రుసరుసలాడినా ఒకరి చావును మాత్రం కోరుకోరు. కానీ ఓ కోడలు అత్త చనిపోయిందని సంబర పడింది. అది సహించని భర్త మా అమ్మ మరణిస్తే సంతోషిస్తావా అని కోడలిని హత్య చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని జునారాజ్ వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 9న చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వృద్ధురాలు మాలతి(అత్త) మృతిచెందారు. దీంతో కోడలు శుభంగీ లోఖండే(35) ఆనందం తట్టుకోలేకపోయింది. ఆ ఆనందాన్ని లోపల దాచుకోకుండా బయటకు చెప్పుకుంది. అదీ కట్టుకున్న భర్త సందీప్ లోఖండే ముందే చెప్పింది. దీంతో ఆ భర్తకు కోపం చిర్రెత్తుకొచ్చింది. ఎవరికైనా తన తల్లి చనిపోతే బాధగానే వుంటుంది. అలాంటిది తన భార్య తన అమ్మ చనిపోవడం చాలా ఆనందంగా వుందని చెప్పడంతో అతనికి కోపం ఆగలేదు. దీంతో సందీప్ ఆవేశంతో ఆమెను ఇంటి పై అంతస్థు నుంచి తోసివేసి చంపేశాడు. తొలుత ఆమె అత్త మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి శుభంగి మృతికి సందీపే కారణమని తేల్చారు.