శివరాత్రి వేడుకల కోసం భక్తులతో పాటు ఆలయాలు, రవాణా సంస్థలు కూడా ముందస్తు ఏర్పాట్లులో తలమునకలయ్యాయి. పర్వదినం సందర్భంగా ఆంధప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. వివిధ ప్రాంతాల నుంచి 3,800 ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహిస్తారు. దక్షిణ కాశీగా, దక్షిణ కైలాసంగా పేరొందిన శ్రీశైలానికి 650 బస్సులు, కోటప్పకొండకు 675, కడప జిల్లా నలమల అటవీ ప్రాంతంలోని పొలతల ఆలయానికి 200, పట్టిసీమకు 100 బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ తెలిపింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. ఈ బస్సులో సాధారణ చార్జీలనే వసూలు చేస్తామన్నారు. ఏపీలోని మొత్తం 101 శైవ క్షేత్రాలకు 25 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనా ఉందని, ఆలయాల దగ్గర బస్సుల కోసం తాత్కాలిక బస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ అత్యంత ప్రాధాన్యమిస్తుదన్న ఆయన, ఘాట్ రోడ్ల మీదుగా వెళ్లే బస్సులను నైపుణ్యమున్న డ్రైవర్లతతో నడిపిస్తున్నామని చెప్పారు.