తెలుగు సినిమాల్లో వచ్చిన భక్తి పాటలకు కొదవే లేదు. మామూలుగా తెలుగులో అన్ని దేవుళ్ళ మీద చాలా అల్బమ్స్ ఉన్నాయి. పాత తరం నుంచి కొత్త తరం వరకు అందరూ శివుని మీద పాటలు పాడినవారే. అలాగే మహేశ్వరుని మీద వచ్చిన సినిమా పాటలు కూడా కొన్ని హిట్ అయ్యాయి. భక్తి పాటలకు తీసిపోని లెవల్లో ఉండే ఆ పాటలంటే చాలా మంది తెలుగు ప్రజానీకం చెవులు కోసుకుంటారు. ఏ రోజు విన్నా వినకపోయినా మహాశివరాత్రి రోజు మాత్రం తప్పక వింటారు. అలాంటి పాటలను ఈ రోజు కొన్ని రివ్యూ చేసుకుందాం.
శివుని పాటలు చెప్పుకున్నప్పుడు మొట్టమొదట చెప్పుకోవలసినది మాత్రం కన్నడ రాజ్ కుమార్ నటించిన శ్రీకాళహస్తీశ్వర మహత్యం సినిమాలో పాటలు. ఇందులో మధురం శివ మంత్రం, జయజయ మహాదేవ, మహేశ పాప వినాశ అనే మూడు పాటలూ సూపర్ హిట్ అయ్యాయి. శివుని మీద వచ్చిన ఈ రెండు పాటలు వింటున్న వాళ్ళల్లో భక్తి ఉప్పొంగడం ఖాయం.
తర్వాత చెప్పుకోవలసిన పాటలు మాత్రం ఎన్టీయార్ నటించిన భూకైలాస్, సీతారామ కల్యాణం సాంగ్స్ గురించి. భూకైలాస్ లో దేవదేవ ధవళాచల, నీలకంధరా దేవ అనే రెండు సాంగ్స్ సూపర్, బంపర్ హిట్స్ అయ్యాయి. 1960ల నుంచి 90ల వరకు ఈ పాటలు మోగని దేవాలయాలు, ఇళ్ళు లేవనే చెప్పాలి. దీని తరువాత వచ్చిన సీతారామ కల్యాణం సినిమాలో కానరార కైలాస వాస అనే పాట కూడా అంతే హిట్ అయింది. ఈ పాట తీసినవిధానం గురించి, చూపించిన విధానం గురించి చాలా చెప్పుకుంటారు. మహాశివరాత్రి తప్పక వినే పాటల్లో ఇది కూడా కచ్చితంగా ఉంటుంది. అలాగే జగదేకవీరుని కథ సినిమాలో శివశంకరీ అనే పాట కూడా శివుని గురించే ఉంటుంది. ఈ పాటలన్నింటినీ ఘంటసాలే పాడడం మరో విశేషం.
వీటి తర్వాత చెప్పుకోవలసింది మాత్రం కృష్ణంరాజు నటించిన భక్త కన్నప్ప సినిమాల శివశివ శంకర పాట గురించి. రామకృష్ణ పాడిన ఈ పాట చాలా పెద్ద హిట్ అయింది. ఇది కూడా అందరూ తప్పక వినే పాటల్లో ఒకటి.ఇక మంజునాథ సినిమాలో మహాప్రాణ దీపం పాట గురించి చెప్పనే అక్కరల్లేదు. శంకర్ మహదేవన్ బ్రీత్ లెస్ గా పాడిన ఈ పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. శివరాత్రి రోజు మోగే పాటల్లో ఇది కూడా తప్పనిసరిగా ఉంటుంది. వీటితో పాటూ సిరివెన్నెల సినిమాలో ఆదిభిక్షువు వాడినేమి కోరేది సాంగ్ కూడా శివుని మీద పాట కిందనే కన్సిడర్ చేస్తారు.
ఇవి కాకుండా శివుని మీద చాలా ప్రైవేట్ ఆల్బమ్స్ వచ్చాయి. ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం లాంటివాళ్ళు బోలెడు పాటలు పాడారు. అలాగే కొత్త తరంలో స్మిత, మంగ్లీలాంటి వాళ్ళు శివుని మీద పాటలు పాడుతూ ఆల్బమ్స్ చేశారు.