తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలు శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. సుప్రసిద్ధ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గురువారం తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. అత్యంత పవిత్రమైన శివరాత్రి రోజున భక్తులు శివుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయ ఆవరణలో దీపారాధన చేస్తున్నారు. అభిశేక ప్రియుడైన ముక్కంటికి బిల్వపత్రాలు సమర్పించుకుంటున్నారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, శ్రీముఖలింగం, మహేంద్రగిరి, రామతీర్థం, నర్సీపట్నం, వేములవాడ, కీసర, వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం, పాలకుర్తి సోమేశ్వరస్వామి, వరంగల్‌లోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి తదితర ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది.
శ్రీశైలంలో అర్ధరాత్రి 2 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. కీసర రామలింగేశ్వరస్వామి ఆలయం, కాళేశ్వరం, రామప్ప ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయానికి ఉదయం నుంచే భక్తుల తాకిడి పెరిగింది. వేములవాడ రాజన్న క్షేత్రంలో శుక్రవారం నుంచే వేడుకలు మొదలయ్యాయి. ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్వామివారికి శనివారం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మూడు లక్షల మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఆలయ నిర్వాహకులు వేడుకలకు ఏర్పాట్లు చేశారు