Maha Shivaratri 2023 :Maha Shivaratri History and Significance & Celebration
mictv telugu

శివరాత్రి మిగతా పండగలకు భిన్నం..ఎందుకు?

February 18, 2023

హిందూ సంప్రదాయంలో పండగలు అనేకం. ఒక్కో పండగకు ఒక్కో చరిత్ర, రకరకాల ఆచారాలు ఉంటాయి. అందులో శివరాత్రి పర్వదినం కూడా ఒకటి. సాధారణంగా ఎక్కువ పండగలు పగటి పూట జరుగుతూ ఉంటాయి. కానీ శివరాత్రి మాత్రం రాత్రి సమయంలోనే జరుపుతారు. జాగరం,శివుడికి నైవేద్యా సమర్పణ అంతా చాలా మంది భక్తులు రాత్రి సమయాల్లో చేస్తారు. దేశమంత్రా ఎంతో ప్రతిష్టాత్మకంగా ముక్కంటిని దర్శనం చేసుకొని ఆయన ఆరాధనలో పరవశిస్తారు. ఇంతటి మహత్యం కలిగిన ఈ పండుగ వెనక ఉన్న పురాన రహస్యం ఏంటి? ఎందుకు శివరాత్రి పండగ చేసుకుంటారో తెలుసుకుందాం.

చాలా మంది భక్తులు మహా శివరాత్రికి సంబంధించిన చరిత్రను ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతారు. దీని వెనక అనేక పురాణ కథనాలు ఉన్నాయి. కొంత మంది అయితే సాగర మథనం కారణంగా బయటకు వచ్చిన విషాన్ని శివుడు స్వీకరిస్తాడని, దాన్ని తన కంఠంలోనే నిలుపుకొని సమస్తలోక రక్షణ కోసం ఇలా చేస్తాడని చెబుతారు. అందుకే అతన్ని నీలకంఠుడు అని పిలుస్తారు. కాలకూట విష ప్రభావంతో శివుడికి కీడు కలగకుండా దేవతలు రాత్రంతా మేలుకుని ఉన్నారని చెబుతారు.

అంతే కాకుండా దీని వెనక మరో విశేషం కూడా ఉందట. శివ, దేవేరి (పార్వతి) వివాహం జరిగిన రోజును శివరాత్రిగా పిలుస్తారు. ఇదే రోజు ఈశ్వరుడు లింగాకారంగా ఆవిర్భవించాడని కూడా శివపురాణంలో ఉంది. అందుచేత ఈ రోజున ఆయన స్మరించి కొలుస్తే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే శివరాత్రి రోజు భక్తులు శివ ప్రతిష్ట చేసినా లేక శివకళ్యాణం జరిపించినా తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని విశ్వసిస్తారు.

ఈ పండగ ఎప్పుడు వస్తుంది : 

బహుళ చతుర్థి, అర్ద్ర నక్షత్రం రోజున ఈ పండుగ వస్తుంది. ఆ రోజునే శివుడు లింగోద్భవం జరిగింది. ఇది శంకరుడికి అతి ఇష్టమైన తిథిగా చెబుతుంటారు. అందుకే మాఘమాసములో కృష్ణ పక్ష చతుర్ధశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్నరోజును మహాశివరాత్రిగా పిలుస్తారు. అర్ధరాత్రి జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వది కాలం. కాబట్టి శివుడి అనుగ్రహం కొరకు రాత్రి మేలుకొని భక్తితో అభిషేకాలు,పూజలు,భజనలు చేస్తారు. ఇది శైవులకు అత్యంత పుణ్య ప్రదమైన రోజు.

శివుడు లింగాకారంలో ఎందుకు ఉద్భవిస్తాడు : 

మెడలో పాము, చేతిలో త్రిశూలం, ఒంటిపై బూడిదతో సర్వసంగ పరిత్యాగిలా ఉండే బోళా శంకరుడు లింగం రూపంలో ఉద్భవిస్తాడు. ఇలా శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కధ ఉంది. ఒకసారి బ్రహ్మ,విష్ణువుల మధ్య వీరిద్దరిలో ఎవరు గొప్ప అనే అంశంపై చర్చ జరుగుతుంది. మాట మాట పెరిగి తమలో ఎవరు గొప్పో అని తేల్చుకోవడానికి తమ శక్తిని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తారు. దీన్ని గమనిస్తున్న శివుడు వారికి జ్ఞాన బోధన చేయాలని అనుకుంటాడు. వెంటనే లింగం రూపంలో అవతరిస్తాడు.

లింగాకారం చూసిన బ్రహ్మ, విష్ణువులు దాని ఆది అంత్యాలు తెలుసుకోవాలని అనుకుంటారు. వెంటనే బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆకాశానికి వెళ్లగా, విష్ణువు వరాహ రూపంలో పాతాళానికి వెళతాడు. అయినా వారికి తుది, మొదలు దొరక్కపోవడంతో శివుడిని ప్రసన్నం చేసుకుంటాడు. అప్పుడు ఆయన ఎవరు గొప్ప అనే ప్రశ్నకు తావులేదని, అందరూ సమానమేనని హితబోధ చేస్తాడు. ఇలా ఉద్భవించిన లింగాన్ని భక్తులు ఎంతో నమ్మకంతో పూజలు చేస్తూ ఉంటారు.

భక్తుల విశ్వాసం ఇదే : 

శివరాత్రి మహిళలు ముఖ్యంగా పవిత్రంగా భావిస్తారు. వివాహం జరిగిన వారు తమ భర్త,పిల్లల శ్రేయస్సు కోసం ఉపవాస దీక్షలు చేస్తారు. అలాగే పెళ్లికాని వారు  శివ, పార్వతిలా కలిసి జీవించే సౌభాగ్యం దక్కాలని కోరుకుంటారు. శివరాత్రి నాడు శివుని పేరును స్వచ్ఛమైన భక్తితో పలికే ఎవరికైనా సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. అందుకే శివరాత్రి రోజున ఉపవాసంతో శివున్ని కొలుస్తారు. రాత్రి పూట స్వామిని దర్శించుకొని జాగరం చేయడం జరుగుతుంది.