భారతంలో ఇంటర్నెట్టే కాదు.. వైఫై, ఫేస్‌బుక్ మరెన్నో! - MicTv.in - Telugu News
mictv telugu

భారతంలో ఇంటర్నెట్టే కాదు.. వైఫై, ఫేస్‌బుక్ మరెన్నో!

April 18, 2018

వెనకటికి ఎవడో పిచ్చిముదిరి తలకు రోకలిని చుట్టమన్నాడని సామెత. మహాభారత కాలంలోనే ఇంటర్నెట్, శాటిలైట్లు ఉండేవని వాక్రుచ్చి నవ్వులపాలవుతున్న త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌దేవ్ కుమార్.. అవేమీ పట్టించుకోకుండా తన మాటకు గట్టిగా కట్టుబడి ఉన్నారు. ఇలాంటి టెక్నాలజీ అంతా వేల ఏళ్లకిందట కాదు, లక్షల ఏళ్ల కిందటే మన దేశంలో వాడారని మళ్లీ సగర్వంగా ప్రకటించాడు బుధవారం. అంతటితో ఊరుకోకుండా.. ‘నా మాటలు నమ్మనివాళ్లు సంకుచిత మనస్కులు..’ అని కూడా తిట్టిపోశాడు.

‘భారతీయులు గర్వపడాలి. చాలా ఏళ్ల కిందటే మనవద్ద మరే దేశంలోనూ లేని టెక్నాలజీ ఉంది..’ అని సీఎం చెప్పారు. ఆయనకు తాన అంటే తందాన అన్నట్లు గవర్నర్ తథాగథ రాయ్ కూడా మద్దతు పలికాడు. దివ్యదృష్టి, పుష్పక విమానం వంటివి ఆ కాలంలో ఇలాంటి టెక్నాలజీ లేకపోతే సాధ్యం కావని అన్నారు. జనం ఈ మాటలు విని పొట్ట చక్కలయ్యేట్టు నవ్వుకుంటున్నా ముఖ్యమంత్రి తన మాటకే కట్టుబడి ఉండడం ఇంకా విస్తుగొలుపుతోంది.

బిప్లబ్ దేవ్ వ్యాఖ్యలపై ఇంటర్నెట్టులో పేలుతుతున్న జోకుల్లో కొన్ని..

‘‘అవును.. మహాభారత కాలంలో ఇంటర్నెట్ ఉండేది. కాదని ఎవరన్నారు. నెట్ ఉండబట్టే కుంతీదేవి సూర్యుడి నుంచి  యాప్‌లో కర్ణుడిని డౌన్‌లోడ్ చేసుకుంది..’’

‘’ఏకలవ్యుడికి విలువిద్య నేర్పేందుకు ఇంటర్వ్యూ జరిగిది. ద్రోణుడు ఏకలవ్యుడి ఆధార్ అసలైందో కాదో అని చెక్ చేశాడు. అయితే ఇంటర్నెట్ స్లోగా ఉండడంతో విసుగెత్తి.. ఏలవ్యుడిని ఇంటికి పంపాడు. తర్వాత ఏకలవ్యుడు యూట్యూబ్‌లో పైరేటెడ్ వీడియోలు చూసి విలువిద్య నేర్చుకున్నాడు..’’

‘’కృష్ణుడు భగవద్గీతను యుద్ధం మధ్యలో ఫేస్‌బుక్ ద్వారా లైవ్‌లో స్ట్రీమ్ చేశాడు..’’

‘‘మహాభారత కాలంలో ఫేస్‌బుక్ కూడా ఉండేది. మార్కండేయ మహర్షి ముఖపుస్తకి పేరుతో దాన్ని తీసుకొచ్చాడు. ఆ మార్కండేయుడి వారసుడే మన మార్క్ జుకర్‌బర్గ్’’

‘అసలు మహాభారత యుద్ధం ద్రౌపది వల్ల జరగలేదు. వైఫై కోసం జరిగింది. పాండవులు తమ వైఫై పాస్‌వర్డ్‌ను కౌరవులకు ఇవ్వలేదు. అందుకే యుద్ధం జరిగింది..’

‘అభిమన్యుడు.. పద్యవ్యూహం నుంచి బయటికొచ్చే పాస్‌వర్డ్ మరచిపోయాడు.. అందుకే కౌరవుల చేతుల్లో హతయ్యాడు..’

‘ఇంటర్నెట్ రామాయణ కాలంలో కూడా ఉండుంటే హనుమంతుడికి పనికొచ్చేది. లక్ష్మణుడు మూర్ఛపోయాక సంజీవని మొక్క కోసం ఏకంగా కొండకు కొండనే తీసుకురావాల్సిన ఖర్మ తప్పేది. గూగుల్లో సంజీవని మొక్క ఇమేజ్ చూసి దాన్ని పెరుక్కొచ్చేవాడు..’

ఇలాంటివన్నీ ఒక ఎత్తయితే తెలుగు క్లాసిక్ సినిమా ‘మాయాబజార్’లోని ప్రియదర్శిక పేటిక వీడియో క్లిప్పు పెట్టి పేలుస్తున్న జోకులు ఒక ఎత్తు. కృష్ణబలరాముల కుటుంబం ఆన్‌లైన్‌లో పతంజలి ఉత్పత్తులు కొంటోందని, వారు అర్జునుడి లొకేషన్ తెలుసుకుని ఆన్ లైన్‌లో చాటింగ్ చేస్తున్నారని.. అదని.. ఇదని అంటున్నారు