ఇంకా దొరకని దీక్షిత్ ఆచూకీ.. తండ్రి ఫ్రెండ్స్‌పై అనుమానం - MicTv.in - Telugu News
mictv telugu

ఇంకా దొరకని దీక్షిత్ ఆచూకీ.. తండ్రి ఫ్రెండ్స్‌పై అనుమానం

October 21, 2020

Mahabubabad deekshit is still missing

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టు రంజిత్ తనయుడు దీక్షిత్(9) కిడ్నాప్‌ అయిన విషయం విదితమే. ఈ సంఘటన జరిగి మూడు రోజులు కావస్తున్నా ఇంకా ఆ బాలుడి ఆచూకీ దొరకలేదు. దీంతో ఆ బాలుడి కుటుంబ సభ్యులు మరింత ఆందోళన చెందుతున్నారు. కిడ్నాపర్లు ఇంటర్నెట్ కాల్స్ చేస్తుండడంతో వారిని ట్రేస్ చేయడం పోలీసులకు కష్టంగా మారింది. కిడ్నాపర్ల నుంచి వస్తున్న ఫోన్ కాల్‌ను ట్రాక్ చేసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన నలుగురు సభ్యుల సైబర్ క్రైం నిపుణుల బృందం నిన్న పట్టణంలోని పలు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించింది. ఈ కిడ్నాప్ తన ఫ్రెండ్స్ చేసి ఉంటారని బాలుడి తండ్రి రంజిత్ పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు ఐదుగురు అనుమానితుల పేర్లను కూడా పోలీసులకు ఇచ్చినట్టు తెలుస్తోంది. కిడ్నాపర్లను తనతో చూసి ఉండడం వల్లే వారు పిలవగానే దీక్షిత్ వారితో వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. 

స్థానిక కృష్ణ కాలనీలో నివాసం ఉంటున్న రంజిత్‌, వసంత దంపతుల పెద్ద కుమారుడు దీక్షిత్ ఆదివారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. ఎంత వెతికినా దొరకలేదు. బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు దీక్షిత్‌ని తీసుకుపోయారని స్థానికులు తెలిపారు. ఆరోజు రాత్రి 9:45 నిమిషాలకు కొందరు కిడ్నాపర్లు వసంతకు ఫోన్ చేసి రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. అడిగిన మొత్తం ఇస్తే దీక్షిత్‌ను విడిచిపెడతామన్నారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని హెచ్చరించారు. బాలుడి ఇంటి పరిసర ప్రాంతాల్లో తమ వ్యక్తులు ఉన్నారని బెదిరించారు. మీరు ఏం చేస్తున్నా మాకు తెలుస్తుందిని తెలిపారు. మీ బాబుకు జ్వరంగా ఉండడంతో మాత్రలు కూడా వేశామని చెప్పారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.