తెలంగాణ పోలీసులకు కరోనా భయం.. మహబూబాబాద్ డీఎస్పీ మృతి - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ పోలీసులకు కరోనా భయం.. మహబూబాబాద్ డీఎస్పీ మృతి

August 11, 2020

Mahabubabad DSP Passed Away With Corona

తెలంగాణలో కరోనా వణికిస్తోంది. మహమ్మారిపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కూడా తరుచూ వ్యాధిబారిన పడుతూనే ఉన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది, డాక్టర్లు, పోలీసులకు సోకడం కలకలం సృష్టిస్తోంది. అయితే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వారు మృత్యువాత పడుతున్నారు. తాజాగా ఓ డీఎస్పీ కరోనా కాటుకు బలి అయ్యారు. మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో పని చేసే డీఎస్పీ శశిధర్ (50) ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన పోలీసు శాఖను విచారంలోకి నెట్టింది.హైదరాబాద్,కేర్ హాస్పిటల్ చికిత్స తీసుకుంటూ ఆయన మరణించారు.

శశిధర్ గత నెల 26న కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి చనిపోయారు. 1996 బ్యాచ్‌కు చెందిన ఆయన బెల్లంపల్లి,కరీంనగర్,సిరిసిల్లలో ఆర్ఐగా బాధ్యతలు నిర్వహించి ఇటీవల డీఎస్పీ పదోన్నతిపై మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చారు. కరోనా సమయంలో నిత్యం విధులు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో ఆ వ్యాధి ఆయనకు సోకి ప్రాణాలను తీసుకుంది. ఆయనకు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. ఈ సంఘటనపై పోలీసు శాఖ విచారం వ్యక్తం చేసింది.