మహబూబాబాద్ జిల్లాలోని కస్తూర్బా బాలికల వసతి గృహంలో నిర్వాహకుల నిర్లక్ష్యం పిల్లల ప్రాణాల మీదికి తీసుకొచ్చింది. కలుషిత ఆహారం తిని 50 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో అల్లాడారు. విషయం తెలుసుకున్న సిబ్బంది హాస్టల్‌కే వైద్యులను పిలిపించి రహస్యంగా చికిత్స చేయించారు. విషయం బయటికి పొక్కడంతో విద్యార్థినులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చాలామంది కడుపు నొప్పితో బాధపడుతున్నారని వైద్యులు చెప్పారు. కొందరికి వెంటిలేటర్ మీద శ్వాస అందిస్తున్నారు. పిల్లల ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు.
పిల్లలు అనారోగ్యానికి గురైన సంగతిని నిర్వాహకులు వారి తల్లిదండ్రులకు కూడా చెప్పకపోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బుధవారం రాత్రి టమాట కూర వడ్డించారని, అందులో ఏమైనా పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. విద్యార్థినులనుఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ పరామర్శించారు. దీనికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.