యాదాద్రిలో వైభవంగా మహాకుంభ సంప్రోక్షణ.. - MicTv.in - Telugu News
mictv telugu

యాదాద్రిలో వైభవంగా మహాకుంభ సంప్రోక్షణ..

March 28, 2022

యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులతోపాటు, రాష్ట్ర మంత్రులు హ‌రీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, జగదీశ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.  కుంభ సంప్రోక్షణ నేత్రపర్వంగా కొనసాగింది. దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన చక్రానికి కేసీఆర్ సమక్షంలో సంప్రోక్షణ నిర్వహించారు. మిథునలగ్నంలో ఏకాదశి సందర్భంగా 11.55 గంటలకు ఈ మహోత్సవం ఆవిష్కృతమైంది. దీనిలో భాగంగా శ్రీ సుదర్శన చక్రానికి యాగజలాలతో సంప్రోక్షణ చేశారు.

అనంతరం ప్రధానాలయం గోపురాలపై కలశాలకు కుంభాభిషేకం నిర్వహించారు. 7 గోపురాలపై ఉన్న కలశాలకు కుంభాభిషేకం, సంప్రోక్షణ చేశారు. ఆలయ రాజగోపురాలపై స్వర్ణ కలశాలకు 92 మంది రుత్వికులతో సంప్రోక్షణ జరిగింది. అనంతరం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరోవైపు మిగిలిన ఆలయ గోపురాలకు శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు ఆధ్వర్యంలో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12. 20 నిమిషాల నుంచి గర్భాలయంలోని మూలవరుల దర్శనం మొదలైంది. అనంతరం కేసీఆర్ దంపతులు స్వామివారికి తొలిపూజ చేశారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత సర్వదర్శనానికి భక్తులను అనుమతి ఇచ్చారు. నేపథ్యంలో ఆలయ ఉద్ఘాటన సందర్భంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.