సావిత్రి మళ్లీ పుట్టింది.. మహానటి టీజర్ కళకళ.. - MicTv.in - Telugu News
mictv telugu

సావిత్రి మళ్లీ పుట్టింది.. మహానటి టీజర్ కళకళ..

April 14, 2018

అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ ‘మహానటి’ టీజర్ వచ్చేసింది. అభిమానులకు పండగ చేసింది. మహానటిగా నటిస్తున్న కీర్తి సురేష్ సావిత్రికి తిరిగి ప్రాణం పోసినట్లు కనిపించింది. ‘అనగనగా మహానటి..’ అంటూ సాగే పాట నేపథ్యంలో సావిత్రి సినిమాల్లోని సీన్లను చూపారు. దేవదాసు తదితర చిత్రాల్లోని ఆమె సన్నివేశాలను బ్లాక్ అండ్ వైట్‌లో కనువిందుగా చూపారు.

సావిత్రి తన అభిమానులకు పలకరిస్తున్న దృశ్యాలు, డాక్టర్ చక్రవర్తి సినిమా విడుదలైనప్పుడు హౌస్ ఫుల్ బోర్డు, తన భర్తతో ఉన్న సీన్లు కూడా ఉన్నాయి. టీజర్ మొదట్లో సావిత్రి గొంతుక వినిపిస్తోంది. ఆమె చరమదశలో సరిగ్గా మాట్లాడలేని స్థితిలో ఉన్న సీన్‌లా ఉంది. అయితే ఆమెను చూపించకుండా కేవలం గొంతును మాత్రమే వినిపించారు. జర్నలిస్టులుగా నటిస్తున్న విజయ్ దేవరకొండ, సమంతలు కొన్ని పేపర్ క్లిప్పులను, సావిత్రి ఫొటోలను చూస్తున్నారు. సావిత్రి జీవితాన్ని అన్వేషించే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో స్వప్నాదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, మోహన్ బాబు, క్రిష్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.