పేదల దేవుడు.. సైకిల్‌పై వెళ్లి కరోనా రోగులకు చికిత్స  - MicTv.in - Telugu News
mictv telugu

పేదల దేవుడు.. సైకిల్‌పై వెళ్లి కరోనా రోగులకు చికిత్స 

October 23, 2020

Cycle

వైద్యో నారాయణో హరి అంటూ ఉంటారు పెద్దలు. ఆ నారాయణుడే వైద్యుని రూపంలో వచ్చి సకల జీవరాశుల ఆరోగ్యస్థితిని సమీక్షిస్తూ వైద్యం చేస్తున్నారని భావిస్తారు. అందుకే డాక్టర్ కనబడగానే చేతులెత్తి మొక్కుతారు. అతన్ని దేవుడితో సామానంగా ఆరాదిస్తారు. ముఖ్యంగా ఇటీవల కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత వారిపై గౌరవం మరింత పెరిగింది. తమ ఆరోగ్యాన్ని, ప్రాణాలను ఏ మాత్రం లెక్క చేయకుండా ఎంతో ధైర్యంగా ప్రజల ప్రాణాలను నిలుపుతూ వచ్చారు. రోజుల తరబడి ఇంటికి కూడా వెళ్లకుండా ఆస్పత్రుల్లోనే గడిపిన సందర్భాలు చాలా ఉన్నాయి. 

ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు ప్రజలను రాచి రంపాన పెడుతున్నాయి. వైద్యానికి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ కొత్త దందాకు తెరలేపాయి. ఆస్తులు అమ్మినా ప్రాణాలు మిగులుతాయనే భరోసా మాత్రం లేకుండా పోయాయి. ఇక పేదలు అయితే డబ్బులు లేక ఇంటికే పరిమితమై చనిపోతున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారి కోసమే ఓ ఆపద్భాందవుడిలా వచ్చాడు ఓ డాక్టర్. ఆస్పత్రికి వెళ్లలేని కరోనా రోగులకు ఆయనే స్వయంగా ఇంటింటికి తిరిగి వైద్యం అందిస్తున్నాడు. మహారాష్ట్రలోని ఓ హోమియెపతి డాక్టర్ చేస్తున్న ఈ సేవ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 

చంద్రపూర్ జిల్లాకు చెందిన రామ్‌ చంద్ర దండేకర్ అనే డాక్టర్ పేద ప్రజల కోసం వైద్య సేవలను అందిస్తున్నాడు. 78 ఏళ్ల వయసులో కూడా తన ఆరోగ్యాన్ని ఏ మాత్రం లెక్క చేయకుండా సపర్యలు చేస్తున్నాడు. ఆసుపత్రిలో చేరలేని వారికి అండగా నిలుస్తున్నాడు. ప్రతి రోజూ సైకిల్‌పై రోజుకి 10 కిలో మీటర్లు వెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇంత చేసినా కూడా డబ్బులు  కూడా ఆశించకపోవడమే కాకుండా, పేదల ఇంటికే వెళ్లి వైద్యం చేస్తున్నారు. ఇలా కరోనా సమయంలోనే కాదు.. ఆయన గత 60 ఏళ్లుగా కూడా ఇలాగే తన సైకిల్‌పై వెళ్లి వైద్య సేవలు కొనసాగిస్తున్నాడు. ఇటీవల మహమ్మారి సమయంలో కూడా వారికి ఇబ్బంది ఉండకూడదని కష్టమైనా కూడా ఇష్టంగా చేస్తున్నాడు. అతడి సేవలను చూసిన పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్ట  కాలంలో అతడు చేసిన కృషి ఎవరూ చేయలేరని స్థానికులు చెబుతున్నారు.