'నోటా'పై గెలుపొందిన మాజీ సీఎం కొడుకు - MicTv.in - Telugu News
mictv telugu

‘నోటా’పై గెలుపొందిన మాజీ సీఎం కొడుకు

October 25, 2019

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ కుమారులు అజిత్‌ దేశ్‌ముఖ్, ధీరజ్‌ దేశ్‌ముఖ్‌లు లాతూర్‌ జిల్లా నుంచి విజయం సాధించారు. ఈ సందర్భంగా విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ మరో కుమారుడు, బాలీవుడ్‌ నాటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ భావోద్వేగ ట్వీట్‌ చేశాడు. ‘నాన్న మేము సాధించాం!! వరుసగా మూడోసారి అమిత్‌ లాతూర్ సిటీలో గెలువగా, ధీరజ్‌ లాతూర్‌ రూరల్‌ అసెంబ్లీ స్థానాన్ని లక్షా 20 వేల భారీ మెజార్టీతో సొంతం చేసుకున్నాడు. లాతూర్‌ ప్రజలు మాపై ఉంచిన విశ్వాసానికి, నమ్మకానికి ధన్యవాదాలు’ అని ట్విటర్‌లో పేర్కొన్నాడు.

లాతూరు రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ధీరజ్‌ దేశ్‌ముఖ్‌ విజయం సాధించగా..ఇక్కడ ప్రత్యర్థులైన శివసేన అభ్యర్థి సచిన్‌ అలియాస్‌ రవి దేశ్‌ముఖ్‌ కంటే అధికంగా ‘నోటా’కు ఓట్లు వచ్చాయి. ఎక్కడలేని విధంగా నోటా రెండవ స్థానంలో నిలిచింది. దీంతో లాతూరు రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఫలితాలు అందరిని దృష్టిని ఆకర్శించాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి ధీరజ్‌ దేశ్‌ముఖ్‌కు 1,33,161 ఓట్లు లభించగా నోటాకు ఏకంగా 27,287 ఓట్లు వచ్చాయి. మరోవైపు ప్రధాన ప్రత్యర్థి శివసేన అభ్యర్థి సచిన్‌ అలియాస్‌ రవీ దేశ్‌ముఖ్‌కు 13,335 ఓట్లు మాత్రమే లభించాయి.