110 స్థానాల్లో పోటీ చేస్తే.. ఒక్కచోటే ఆధిక్యం..! - MicTv.in - Telugu News
mictv telugu

110 స్థానాల్లో పోటీ చేస్తే.. ఒక్కచోటే ఆధిక్యం..!

October 24, 2019

Maharashtra Election Result Raj Thakre Party

ఒకప్పుడు శివసేన పార్టీలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల్లో ఒకరు రాజ్‌థాక్రే. పార్టీ బలోపేతంలో ఆయన ఎంతో ప్రభావం చూపారు. అప్పట్లో తన ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకొని మహారాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. కానీ శివసేన నుంచి బయటకు వచ్చి  సొంత కుంపటి పెట్టుకున్నాక పెద్దగా ప్రభావం చూపడం లేదు. తాజాగా వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. 110 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక్క చోట మాత్రమే తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది.  

మహారాష్ట్ర ఎన్నికల్లో దాదాపు అన్ని ప్రధాన పార్టీలు రెండంకెల స్థానాల్లో దూసుకెళ్లాయి. తన మాటలతో జనాన్ని ఆకర్షించే నాయకుడిగా ఎదిగిన రాజ్‌ థాక్రే మాత్రం  తన పార్టీని మాత్రం గెలుపుబాట పట్టించలేకపోయారు. కేవలం ఒక్కటంటే ఒక్క స్థానంలో మాత్రమే ఆధిక్యం ప్రదర్శించారు. 2006లో శివసేన నుంచి రాజ్ థాక్రే బయటకు వచ్చి పార్టీ పెట్టారు. తర్వాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థులు 13 స్థానాల్లో విజయం సాధించారు. 2014లో కేవలం ఒక్క స్థానానికే పరిమితం కాగా.. ఈసారి కూడా అలాంటి గడ్డు పరిస్థితినే ఆ పార్టీ ఎదుర్కొంటోంది. తాజాగా  ఫలితాలతో రాజ్‌ థాక్రే రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు బాల్ థాక్రే తర్వాత నేతగా గుర్తింపు పొందిన ఆయన తన పార్టీని నిలబెట్టుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.