మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం మంత్రివర్గంతో భేటీ అయిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఔరంగాంబాద్ పట్టణాన్ని శంభాజీ నగర్‌గా పేరు మారుస్తూ తీసుకొచ్చిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉస్మానాబాద్ పేరును ధారాశివ్‌గా మార్చేయాలని కేబినెట్ నిర్ణయించింది. నవీ ముంబై ఎయిర్‌పోర్టు పేరును డీబీ పాటిల్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చేసింది. విశ్వాస పరీక్షను ఎదుర్కోవడానికి ముందు కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది.
నా వల్ల ఏమైనా తప్పు జరిగితే మన్నించండి: సీఎం
ఇక మంత్రి వర్గ సమావేశంలో ఉద్ధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ.. తన వల్ల తప్పులేమైనా ఉంటే క్షమించాలని మంత్రివర్గ సభ్యులను కోరారు. రెండున్నరేళ్ల పాటు సహకరించిన అందరికీ ఉద్ధవ్ థాక్రే కృతజ్ఞతలు తెలిపారు. తన వాళ్లే తనను మోసం చేశారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. ఆ తర్వాత కేబినెట్ భేటీని ముగించుకుని సచివాలయం బయటకు వచ్చిన ఉద్ధవ్ థాకరే మీడియా ప్రతినిధులకు నమస్కారం చేసి వెళ్లిపోయారు. రేపు మహారాష్ట్ర శాసనసభలో బలపరీక్ష జరగనుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఉద్ధవ్ థాక్రే రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించే అవకాశాలున్నాయి.