రూ.10కే 2 చపాతీలు, కర్రీ, అన్నం, పప్పు.. - MicTv.in - Telugu News
mictv telugu

రూ.10కే 2 చపాతీలు, కర్రీ, అన్నం, పప్పు..

January 27, 2020

Meals

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే రూ.10కే భోజనాన్ని అందించే ‘శివ్ భోజన్’ కేంద్రాలను ఆదివారం కొన్నిచోట్ల ప్రారంభించారు. రాష్ట్రంలోని పేదలు ఆకలితో పస్తులు ఉండకుండా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసమే ఈ నూతన పథకాన్ని ప్రారంభిస్తున్నామని ఉద్దవ్ థాకరే వెల్లడించారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా పలు జిల్లాల్లో ఇవి ప్రారంభమవుతాయని, ఆపై రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని ఆయన తెలిపారు. శివ్ భోజనం కింద రూ. 10కి రెండు చపాతీలు, ఒక వెజిటబుల్ కర్రీ, అన్నం, పప్పు పెడతారు. ఈ క్యాంటీన్లు మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు అందుబాటులో ఉంటాయి. ఒక్కో కేంద్రంలో 500 పేట్లు పంపిణీ చేస్తారు. 

అయితే ఈ భోజనం చేయాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి అని వచ్చిన వార్తలను రాష్ట్ర మంత్రి భుజ్ బల్ ఖండించారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని.. ఎటువంటి గుర్తింపు కార్డునూ చూపకుండా పేదలు తృప్తిగా భోజనం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. భోజనం అయిపోయేంత వరకూ తొలుత వచ్చిన వారికి ముందు అందిస్తామని అన్నారు. కాగా, ఎన్నికల తరువాత కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ‘మహా అఘాడీ’ ప్రభుత్వం ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. మేనిఫెస్టోలోని అంశాలను ఒక్కొక్కటీ అమలు చేసే దిశగా థాకరే కదులుతున్నారు. ఈ పథకాన్ని ప్రవేశ పెడతామని శివసేన పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న కొత్త ప్రభుత్వంపై స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.