Maharashtra Minister Sandeepan Bumre underwent dental surgery in cellphone torch light
mictv telugu

మంత్రికి సెల్‌ఫోన్ లైట్లతో ఆపరేషన్.. ఆయన రియాక్షన్ ఎలా ఉందంటే

October 18, 2022

దేశంలో వైద్యపరమైన మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో నిత్యం మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. అయినా పరిస్థితుల్లో మార్పు వస్తున్నట్టు మాత్రం కనిపించడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు ఘోరంగా ఉంటున్నాయి. కీలకమైన ఆపరేషన్లు చేసే సమయంలో కరెంటు సరఫరాల్లో అంతరాయం వల్ల చీకట్లో వైద్య సేవలందించాల్సిన దౌర్భాగ్యం నెలకొంది. ఇన్నాళ్లూ పేదలకే ఎదురైన ఈ అనుభవం తొలిసారి ఓ కేబినెట్ మంత్రికి ఎదురైంది. దీంతో అందరిలాగే సెల్ ఫోన్ లైట్ల వెలుగులోనే వైద్యులు ఆయనకు ఆపరేషన్ పూర్తి చేశారు.

వివరాల్లోకెళితే.. మహారాష్ట్ర కేబినెట్ మంత్రి సందీపన్ భుమ్రే సోమవారం ఔరంగాబాద్ పట్టణంలోని ఘటి డెంటల్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. అంతేకాక, తన దంతాలను వైద్యుల వద్ద పరీక్ష చేయించుకున్నారు. పరిశీలించిన వైద్యులు.. రూట్ కెనాల్ చేయించుకోవాలని చెప్పడంతో ఆయన సరేనన్నారు. దీంతో చికిత్స ప్రారంభమైంది. అయితే మధ్యలో కరెంటు పోవడంతో మరో మార్గం లేక సెల్ ఫోన్‌లోని టార్చ్ లైట్ వెలుగులో ఆపరేషన్ పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పరిస్థితికి కారణమేంటని మంత్రి ఆరా తీయగా, ఆసుపత్రిలో జనరేటర్ సదుపాయం లేదని కొంత కాలంగా అడుగుతున్నా పట్టించుకోవడం లేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన వెంటనే జనరేటర్ కోసం నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.