కొవ్వొత్తుల వెలుగులో పోలింగ్..  - MicTv.in - Telugu News
mictv telugu

కొవ్వొత్తుల వెలుగులో పోలింగ్.. 

October 21, 2019

polls.

మహారాష్ట్రలో ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఓ వైపు వర్షం.. మరోవైపు పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్‌కు తీవ్ర ఆటంకం ఎదురైంది. ఈ క్రమంలో సాయంత్రం 4గంటల సమయానికి కేవలం 44శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది.  పుణెలోని శివాజీనగర్‌లో పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో కొవ్వొత్తుల వెలుగులోనే అధికారులు పోలింగ్‌ నిర్వహించారు. తమ టేబుళ్లపై కొవ్వొత్తులు పెట్టుకుని ఆ వెలుగులోనే పోలింగ్ సిబ్బంది ఓటర్ల జాబితాను సరిచూసుకున్నారు. 

ఓటర్లు కూడా ఆ వెలుగులోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనిపై స్థానిక ఎన్నికల నిర్వహణ సిబ్బంది మాట్లాడుతూ.. ఆ పాఠశాలకు విద్యుత్‌ సరఫరా లేదని.. మీటర్‌లో ఇబ్బంది ఉన్నట్టు గుర్తించామని అన్నారు. ఆ సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడంతో ఎన్నికల సంఘం జనరేటర్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు.

ఈ పరిస్థితి దాదాపు ఎనిమిది పోలింగ్ కేంద్రాల పరిధిలో వుంది. మరోవైపు, భారీ వర్షం కారణంగా పూణెలోని ఓ పోలింగ్‌ కేంద్రం ప్రాంగణమంతా బురదమయం అయింది. దీంతో అక్కడి అధికారులు ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లకు ఇబ్బంది లేకుండా ట్రాక్టర్ల ట్రాలీలను ఓ వంతెనలా అమర్చారు. దానిపైనుంచి ఓటర్లు వెళ్లి ఓట్లు వేశారు.