Maharashtra shocker: PhD student sets himself, woman colleague on fire at Aurangabad University
mictv telugu

యూనివర్శిటీలో దారుణం.. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం

November 22, 2022

బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేస్తూ ఉన్నత చదువులు చదువుతున్న వారిద్దరూ దారి తప్పారు. భావోద్వేగాలకు బానిసైన అతడు.. తనతోపాటు మరో యువతి చావుకు కారణమయ్యాడు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసి.. మంటల్లో కాలుతూనే తాను ప్రేమిస్తున్న యువతుని గట్టిగా హత్తుకున్నాడు. ఈ ఘటనలో యువతి, యువకుడు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మరఠ్వాడ యూనివర్శిటీలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

పోలీసు అధికారి ప్రశాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గజానన్‌ ముండే అనే యువకుడు, యువతి ఇద్దరూ మరఠ్వాడ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ముండే తనను వేధిస్తున్నాడంటూ ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఆ యువతి మాత్రం తనను అన్ని విధాలా వాడుకుందనేది గజానన్‌ ఆరోపణ. ఈ నేపథ్యంలో యువతి ల్యాబ్‌లో ప్రాజెక్ట్‌ చేస్తుండగా.. అక్కడికి వెళ్లిన గజానన్‌ క్యాబిన్‌ తలుపులు మూసివేశాడు. అనంతరం తనతోపాటు తెచ్చుకున్న రెండు పెట్రోల్‌ బాటిళ్లలో ఒకటి తనపై పోసుకుని మరొకటి యువతిపై పోసి నిప్పంటించుకున్నాడు. అనంతరం మంటల్లో కాలుతూనే యువతిని గట్టిగా హత్తుకున్నాడు. ఈ ఘటనలో అతనికి 80 శాతం, యువతికి 50శాతం కాలిన గాయాలయ్యాయి. కళాశాల యాజమాన్యం ఇద్దరినీ స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు బేగంపుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ప్రశాంత్‌ వెల్లడించారు.