Maharashtra: Trainee Aircraft Crashes in Farm Near Pune, Pilot Injured
mictv telugu

పొలంలో కూలిన శిక్ష‌ణ విమానం.. మహిళా పైలెట్‌కు గాయాలు

July 25, 2022

మ‌హారాష్ట్ర‌లోని పుణే స‌మీపంలో క‌ద‌బ‌న్‌వాడీ వ‌ద్ద పంట పొలంలో శిక్ష‌ణ విమానం కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో మ‌హిళా పైల‌ట్ కి గాయాలు అయ్యాయ‌ని అధికారులు వెల్ల‌డించారు. ఈ విమానం పైల‌ట్ల‌కు శిక్ష‌ణ ఇచ్చే కార్వ‌ర్ ఏవియేష‌న్ కంపెనీకి చెందిన‌ద‌ని పుణే ఎస్‌పీ అభిన‌వ్ దేశ్‌ముఖ్ చెప్పారు. సాంకేతిక లోపం త‌లెత్త‌డంతో ట్రైనీ పైల‌ట్ భ‌విక రాథోడ్ విమానాన్ని అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌కు ప్ర‌య‌త్నిస్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌నలో స్వ‌ల్పంగా గాయ‌ప‌డిన పైల‌ట్‌ను న‌వ్‌జీవ‌న్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. సోమ‌వారం ఉద‌యం 11.30 గంట‌ల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని అధికారులు వెల్ల‌డించారు.

భ‌విక రాథోడ్ ఈ ఫ్లైట్లో ఒంటరిగా పుణెలోని బారామతి విమానాశ్రయంలో బయలుదేరింది. కానీ కాసేపటికే పొలంలో కూలిపోయింది. ఫలితంగా విమానం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఒక్కసారిగా భారీ శబ్దం విని.. చుట్టుపక్కల ప్రజలు ఉలిక్కిపడ్డారు. కాసేపటికి తేరుకుని సంఘటనా స్థలానికి పరుగెత్తారు. గాయపడ్డ ట్రైనీ పైలట్ భవికను జాగ్రత్తగా పక్కకు తీసుకొచ్చి.. ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం స్థానిక ఆస్పత్రికి తరలించారు. విమానంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నట్లు డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్-డీజీసీఏ ఓ ప్రకటనలో తెలిపింది.