ఊరికి ఉపకారి.. ఇర్ఫాన్ ఖాన్ జ్ఞాపకార్థంగా పేరు పెట్టుకున్నారు..
మనం చేసే మంచి పనులు మనం పోయాక కూడా మన పేరును చిరస్థాయిగా నిలుపుతాయి అంటారు. అదే జరిగింది దివంగత బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ విషయంలో. ఆయన ఓ గ్రామానికి చేసిన మంచి పనులకు ఆ గ్రామస్తులు ఇర్పన్ ఖాన్ జ్ఞాపకార్థంగా ఊరికి పేరుగా పెట్టుకున్నారు. ఆ మంచి మనిషి పేరును మా ఊరికి పెట్టుకుంటే ఎప్పటికీ మరిచిపోమని.. అజరామరంగా ఆయన పేరు మా నోళ్లల్లో నానుతుందని అంటున్నారు. మహారాష్ట్రలోని ఇగత్‌పురి గ్రామం సమీపంలో ఇర్ఫాన్ పదేళ్ల క్రితం ఓ ఫాం హౌస్‌ను కొన్నారు. ఆ సమయంలో గ్రామస్తుల సమస్యలు తెలుసుకుని సాయపడ్డారు. పేదవారికి తనవంతుగా సాయం చేసి వారికి అండగా నిలబడ్డారు.
ఆ గ్రామానికి అంబులెన్సు సౌకర్యం కల్పించడమే కాకుండా.. పిల్లలకు కంప్యూటర్లు, పుస్తకాలు, రెయిన్ కోట్‌లు, స్వెటర్లు పంపిణీ చేశారు. పండగల సమయంలో స్వీట్స్ పంపించేవారు. అలా ఇర్ఫాన్ ఆ గ్రామస్తులను తనవారికగా భావించి వారికి మంచి చేశారు. దీంతో ఆ గ్రామస్తులకు ఆయన ఆత్మీయుడు అయ్యారు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ జ్ఞాపకార్థంగా తమ గ్రామానికి 'Hero-chi-Wadi' (నైబర్ హుడ్ హీరో) అని పేరు పెట్టుకున్నామని ఇగత్పురి జిల్లా పరిషత్ సభ్యుడు గోరఖ్ బుడ్కే మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ..‘గ్రామంలోని ఎన్నో కుటుంబాల అభివృద్ధికి ఇర్ఫాన్ ఖాన్ సాయం అందించారు. ఎవరు ఎప్పుడు ఏ సాయం అడిగినా కాదనకుండా చేశారు. పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. ప్రతి ఒక్కరి సమస్యలను అడిగి తెలుసుకునేవారు’ అని తెలిపారు. కాగా, ఇర్ఫాన్ గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ.. ఏప్రిల్ 29న మృతిచెందిన విషయం తెలిసిందే.