ఆ రోడ్డు పేరు కరోనా.. అబ్బో, పెద్ద కథే ఉంది.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆ రోడ్డు పేరు కరోనా.. అబ్బో, పెద్ద కథే ఉంది..

May 21, 2020

vnbs,

కరోనా కరోనా.. ఇది తప్ప ప్రపంచంలో మరో ఊసే లేకుండా పోయింది. కోవిడ్, మాస్కులు, భౌతిక దూరం, హైడ్రాక్సీ క్లోరోక్విన్, పీపీఈ, క్వారంటైన్, ఐసొలేషన్ వంటివెన్నో జనం నోళ్లలో నానుతున్నాయి. చివరకు నవమాసాలు మోసి కంటున్న పిల్లలకు కూడా మరే పేరూ దొరకనట్లు కరోనా కుమారి, కోవిద్, లాక్‌డౌన్, శానిటైజర్ అని పెరెట్టుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు ఇటీవలే నిర్మించిన రోడ్డుకు ఈ వైరస్ పేరు పెట్టేశారు. 

మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌లో ఉందీ రోడ్డు. మాండవా గ్రామంలో నుంచి లక్ష్మీవాడి వరకు రోడ్డు పనులు జరిగేవి. మాండవా గ్రామస్తులు సొంతంగా ఈ పని తలపెట్టారు. అయితే నిధుల్లేక సగంలోనే ఆగిపోయింది. లాక్‌డౌన్‌లో మరే పనీ లేకపోవడంతో అందరూ కలసి రోడ్డును పూర్తి చేశారు.  కరోనా కల్లోల కాలంలో నిర్మించుకున్నారు కనుక దానికి ‘ధన్యవాదాలు’ చెబుతూ రోడ్డుకు కరోనా రోడ్ అని నామకరణం చేశారు. ‘కోరోనా రోడ్ 2020’ అని తాటికాయంత అక్షరాలతో పెద్ద సైన్ బోర్డు కూడా నిలబెట్టారు. దీంతో రోడ్డుపై వెళ్లే కొత్తవాళ్లు మొదట జడుసుకుంటున్నా, తర్వాత విషయం తెలిసి నవ్వుకుంటున్నారు. ఇదో ముచ్చటైతే ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జల్లాలో ఇప్పటికే కోరౌనా అనే ఊరొకటి ఉంది. దానికీ వైరసుకూ ఎలాంటి సంబంధమూ లేకపోయినా కేవలం సారూప్యం వల్ల వార్తల్లోకెక్కింది.